అమలాపురం రూరల్: ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు కవితా నీరాజనం మూడు రికార్డులు, మరో మూడు ధృవపత్రాలు, పతకాలు సాధించిందని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం చాన్సలర్, కిమ్స్ వైద్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు(చైతన్య రాజు)తెలిపారు. ప్రతిష్టాత్మకమైన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుంచి అధికారిక గుర్తింపు లభించిందన్నారు. ఈ మేరకు ఆయా ప్రతినిధులు టాటా వెంకట వర ప్రసాద్, కొండ నరసింహరావు, అలమండ ప్రసాద్‌లు ధ్రువపత్రాలు, పురస్కారాలను చెతన్య రాజుకు ప్రదానం చేశారు. అలాగే తెలుగు సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో చేసిన విశిష్ట కృషికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక సత్కారం చేసింది. చైతన్యరాజు మాట్లాడుతూ తెలుగు కవితా నీరాజనం అనే మహత్తర సాహిత్య కార్యక్రమంలో 3 వేల మందికి పైగా కవులు, రచయితలు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొన్నారన్నారు.


