అమలాపురం రూరల్: వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం, జలజీవన్ మిషన్ ఆపరేషన్ నిర్వహణ, వాటర్ గ్రిడ్, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించేలా పైపులైన్ పనులు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, బోర్ వెల్‌ల పునరుద్ధరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ట్యాంకర్ల ద్వారా సరఫరా అవసరమైతే ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఇంజినీర్లకు సూచించారు.
ఫ ప్రయాణికులకు అందిస్తున్న సేవల్లో నాణ్యత, పారదర్శకతను పెంచి వేగవంతమైన సేవల ద్వారా మెరుగైన పనితీరు కనబర్చాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రోడ్డు రవాణా సంస్థ, రావులపాలెం రామచంద్రపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల కార్యాలయాల పనితీరుపై సమీక్షించారు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ ప్రక్రియలు వేగవంతం చేస్తూ సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మిలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు.


