అల్లవరం: రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరం వెంబడి సీఆర్‌జెడ్ పరిధిలో అనధికార ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని శాననమండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ప్రశ్నించారు. సీఆర్‌జెడ్ పరిధిలో ఏదైనా నిర్మాణం, ఇసుక తవ్వకాలు జరిపితే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతోందన్నారు. దీనివల్ల గ్రీన్ బెల్ట్ అంతరించిపోయి తీరం కోతకు గురై సముద్రం ముందుకు వస్తోందన్నారు. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో ఓఎన్‌జీసీ టెర్మినల్‌ను సముద్రం తాకే పరిస్థితి వచ్చిందని, కోనసీమ జిల్లాలో సముద్రం నుంచి ఉప్పునీరు పొంగి డ్రెయిన్ల గుండా ప్రవేశించి పొలాల్లోకి చేరుతోందన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీరం పొడవునా గ్రీన్ బెల్ట్‌ను పునరుద్ధరణ చేయాలని, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.


