ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అద్భుత ప్రతిభ
అమలాపురం రూరల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి ఆర్ట్స్ కల్చరల్ పోటీలను బుధవారం అంబేడ్కర్ భవన్‌లో ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో సహిత విద్యా విభాగం వీటిని నిర్వహిస్తోంది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విభిన్న ప్రతిభాపాటవాలు కలిగి ఉంటారన్నారు.
ఫ జిల్లాలో జీఎస్టీ వాణిజ్య పన్నుల వసూలులో అధికారులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా జిల్లా స్థాయి అధికారులతో జీఎస్టీ పన్నుల వసూలుపై సమావేశం నిర్వహించి, పురోగతిపై సమీక్షిస్తామన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి కీలక కార్యాచరణ అమలు చేయాలని, జాయింట్ టాస్క్‌ఫోర్సు బృందాలను పెండింగ్ బకాయిల వసూలుకు నియమించాలన్నారు.
ఫ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించినందుకుగాను అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అధికారులు, కమిటీ సభ్యుల సమన్వయంతో కల్యాణోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామం, కోటిపల్లి, కుండలేశ్వరాలలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
ఫ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఈ నెల 13 వరకూ జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.


