ఆదిదేవునికి వేదాశీర్వచనం
● రాజాధిరాజ, అశ్వ వాహనాలపై గ్రామోత్సవాలు
● అలరించిన పండిత సదస్యం
సఖినేటిపల్లి: అంతర్వేది తీర్థ మహోత్సవాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజ వాహనంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపైన స్వామివారి గ్రామోత్సవాలు సాగాయి. రాత్రి 8 గంటలకు 16 స్తంభాల మండపం వద్ద నిర్వహించిన చోరసంవాదం భక్తులను అలరించింది.
నైవేద్యాలు సమర్పించిన భక్తులు
శనివారం రాజాధిరాజ వాహనంపైన, అశ్వవాహనంపైన స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకిలో తీసుకువచ్చారు. వాహనాల వద్ద ప్రముఖులు, అర్చకులు కొబ్బరికాయలు కొట్టి గ్రామోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మాడ వీధుల్లో భక్తులు స్వామివారిని దర్శించి అరటిపళ్లు, కొబ్బరికాయలు నైవేద్యాలుగా సమర్పించారు.
కల్యాణ శోభతో స్వామివారు
కల్యాణ శోభతో మెరిసిపోతున్న ఆదిదేవునికి శనివారం లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
సృష్టిలో మొదటిగా ఉద్భవించిన రూపం
సృష్టి ఆదిలో మొదలైన కృతయుగంలో నర మృగ అవతారంలో మొట్టమొదట ఉద్భవించిన రూపం లక్ష్మీనరసింహ స్వామి. శివుడు, విష్ణుమూర్తుల భగవత్ స్వరూపం ఒక్కటే. అందుకే పరమ శివునితో పాటు లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఆదిదేవునిగా ఈ క్షేత్రంలో కొలుస్తారు.
ఏకశిలా మండపంలో..
ఆలయంలోని ఏకశిలా మండపంలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, అర్చకులు, దేవస్థానం వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, పేరూరు వేదపండితులు నిర్వహించిన పండిత సదస్యం ఆద్యంతం భక్తులను అలరించింది. మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి, ప్రధాన అర్చకుడు కిరణ్ ఆధ్వర్యంలో అర్చకులు, పేరూరు వేదపండితులు విష్వక్సేన పూజ, మంటపారాధన, సప్తరుషి పూజలు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, ఆలయ వంశపారంపర్య వ్యవస్థాపక సభ్యుడు రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు పాల్గొన్నారు.
అంతర్వేదిలో నేడు
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి చక్రవారి అవభృధోత్సవం, సముద్రస్నానం నిర్వహిస్తున్నట్టు ప్రధాన అర్చకుడు కిరణ్ తెలిపారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకూ సుప్రభాతసేవ, శ్రీస్వామివారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 8 గంటలకు గరుడ పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి ధ్వజారోహణ నిర్వహిస్తామన్నారు.
అలరించిన చోరసంవాదం ఘట్టం
దారి దోపిడీ దొంగగా మారిన పరకాలుడిని, లక్ష్మీనృసింహ స్వామి తిరుమంగయాళ్వార్‌గా మార్చి, మంచి జీవితాన్ని ప్రసాదించిన ఘట్టాన్ని ఇతి వృత్తంగా చేసుకుని ఈ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రేమించిన యువతిని పెళ్లాడేందుకు తిరుమంగయాళ్వార్ (పరకాలుడు)దారి దోపిడీ దొంగగా మారాడు. స్వామి అతడికి సాక్షాత్కరించి పరివర్తన తేవడాన్ని చూపే ఘట్టమే ఇది.
ఆదిదేవునికి వేదాశీర్వచనం


