పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల | - | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల

పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల

వివాహ సంబంధ సైట్ల ద్వారా పరిచయం

ప్రతిపాదనలు పంపి ఆనక అడ్డంగా దోపిడీ

ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు

రూ.75 లక్షల విలువైన బంగారం,

రెండు కార్లు స్వాధీనం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఒంటరి మహిళలను, భర్త లేని ఆడవారి వివరాలను తెలుగు మ్యాట్రిమొనీ, షాదీ డాట్‌ కామ్‌ల ద్వారా సేకరించి పెళ్లి నాటకమాడి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.లక్షలు దోచుకున్న ఘరానా మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. అతని బాగోతం బయట పెట్టి, అతని నుంచి రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్‌, సీఐ వి.అప్పారావు విలేరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణకృష్ణ తెలుగు మ్యాట్రిమొనీల ద్వారా భర్తలు చనిపోయి, ఒంటరిగా ఉన్న మహిళల ప్రొఫైల్‌ ఎంచుకునే వాడు. తాను బంగారం వ్యాపారం చేస్తుంటానని వారిని పరిచయం చేసుకునేవాడు. వివాహ ప్రతిపాదన పంపిస్తూ ‘మీ వివరాలను తన తల్లిదండ్రులకు చూపానని, మీరు వారికి నచ్చారని, జాతకాలు చూపించానని, చిన్న దోషం ఉందని, గోదావరి స్నానాలు చేసి పూజ చేస్తే పరిహారం అవుతుంద’ని నమ్మబలికే వాడు. ‘రాజమహేంద్రవరం గోదావరిలో స్నానాలకు వస్తే, మా అమ్మానాన్నలను తీసుకువచ్చి పరిచయం చేస్తాన’ని వారికి చెప్పేవాడు. మీ దగ్గరున్న బంగారు వస్తువులను ధరించి చక్కగా చీర కట్టులో రావాలని, అప్పుడే మా అమ్మ నాన్నకు మీరు నచ్చుతారని చెప్పేవాడు. ఇలా హైదరాబాద్‌, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌, బస్టాండ్లకు రమ్మని చెప్పేవాడు. అక్కడకు వచ్చాకా వారిని కారులో పుష్కర ఘాట్‌, కోటిలింగాల ఘాట్‌ల వద్దకు తీసుకువెళ్లేవాడు. వారితో స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారు వస్తువులను తీసి బ్యాగులో పెట్టుకోమని చెప్పేవాడు. వారు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునే గదిలోకి పంపిస్తూ, తాను వెళ్లి పూజ సామానులు తీసుకువస్తానని చెప్పి నమ్మించి ఆ ఆభరణాలతో పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దోచుకువెళ్లిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ నేరాలకు ఉపయోగించిన రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటక ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నాయి. నిందుతుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన సీఐ వి.అప్పారావు, ఎస్సై వై.యేసుబాబు, బి.సురేష్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్‌.వెంకటరామయ్య, ఎస్‌.చంద్రశేఖర్‌, కానిస్టేబుళ్లు బి.విజయ్‌ కుమార్‌, కె.పవన్‌ కుమార్‌, యస్‌.రామకృష్ణలను ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ అభినందించి రివార్డులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement