వాడపల్లికి భక్తజన శోభ
కొత్తపేట: కోనసీమ తిరుమల.. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని క్షేత్రం వేలాది భక్త జనంతో కిక్కిరిసిపోయింది. వారి గోవింద నామస్మరణతో ఆ క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేశాక కోరిన కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అర్చకస్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలో కొలువై ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి ఆలయం ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.


