నేత్రపర్వంగా భీమేశ్వరుని రథోత్సవం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీ ద్రాక్షారామ క్షేత్రంలో శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 4 వ రోజు శనివారం అశేష భక్తజనంతో స్వామివార్ల కల్యాణ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్ల కల్యాణమూర్తులను పుష్పాలతో అలంకరించిన రథంపై అధిష్టింపజేశారు. ధూపసేవ అనంతరం రథాంగ బలి సమర్పించారు. సుమూహూర్త సమయానికి రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివార్ల కల్యాణమూర్తులతో రథం ఆలయం వద్ద నుంచి సూర్యావీధి గుండా వెలంపాలెం చేరుకుని చంద్రావీధి మీదుగా ప్రధాన రహదారి పైకి, తదుపరి యానాం సెంటర్ మీదుగా వేగాయమ్మపేటలోని ఆస్థాన పూజా మండపం వరకు సాగింది. ఆలయ పూజారులు, అర్చక స్వాములు, వేద పండితులు, అశేష భక్తజనులు వెంట రాగా రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. రథంలో ఆసీనులైన కల్యాణమూర్తులను దారిపొడవునా ప్రజలు కనులారా దర్శించుకుని భక్తితో కానుకలు సమర్పించుకున్నారు.
అశేష భక్తజనంతో
భీమేశ్వరస్వామి కల్యాణ రథోత్సవం
నేత్రపర్వంగా భీమేశ్వరుని రథోత్సవం


