జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు పయనం
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్‌కు అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతి విద్యార్థిని కె.కావ్య సుందరి హరిప్రియ ఎంపికై ందని తైక్వాండో సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో బాపట్ల జిల్లా పేకేరులో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ అండర్– 14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దాంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ పంజాబ్‌లోని లుడియానలో జరిగే 69వ జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్‌లో 20 కిలోల విభాగంలో హరిప్రియ పాల్గొనుందన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం బయలు దేరిందన్నారు. జాతీయ పోటీలకు వెళ్తున్న హరిప్రియకు, కోచ్ పితాని లక్ష్మీభార్గవిలకు హెచ్‌ఎం కడలి సాయిరామ్, పీడీలు కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయుడు బీఎస్‌ఎన్ మూర్తి అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
అమలాపురం టౌన్: కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) జిల్లా అధ్యక్షుడిగా అమలాపురానికి చెందిన కొత్తూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి నియామక ఉత్తర్వులను శ్రీనివాస్ అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అమలాపురానికి చెందిన సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజుకు శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు. గతంలో శ్రీనివాస్ డీసీసీలోనే కాకుండా పీసీసీలో కూడా పలు పదవులు నిర్వహించారు.
వంతెన నుంచి పడి వృద్ధుడి మృతి
నల్లజర్ల: పోతవరం ఎర్ర కాలువ వంతెన పైనుంచి కాలుజారి ఓ గుర్తు తెలియని వృద్ధుడు పడిపోయాడు. స్థానికులు అతనిని 108 అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి వయసు 60 నుంచి 65 మధ్య ఉంటుందని, తెల్లని పొడుగు చేతుల చొక్కా, నీలం, నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిస్తే నల్లజర్ల సీఐ రాంబాబు సెల్ నంబర్లు 94407 96614, 95054 40640కు సమాచారం అందించాలని కోరారు.
మ్యాజిక్ ఫ్యామిలీకి గాంధీ సేవా పురస్కారం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ జాతీయ స్థాయి గాంధీ సేవా పురస్కారం అందుకుంది. మెగా మ్యాజిక్ ఫ్యామిలీ, అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చింతా శ్యామ్‌కుమార్ కుటుంబం పేదలకు సేవ చేస్తుంది. అలాగే వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. పై సేవా సంస్థల ద్వారా శ్యామ్‌కుమార్, అన్నపూర్ణ దంపతులు, ఫిజియోథెరపిస్ట్‌లు మోహిత్, సీత దంపతులు చేస్తున్న సేవలను ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కేంద్రంగా పనిచేస్తున్న జీవన్ జాగృతి సేవా సంస్థ గుర్తించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గాంధీజీ సేవా పురస్కారానికి శ్యామ్ కుటుంబాన్ని ఎంపిక చేసింది. ఆ మేరకు అవార్డు కింద సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా శ్యామ్, అన్నపూర్ణ దంపతులు, డాక్టర్లు మోహిత్, సీతలు మాట్లాడుతూ ఈ అవార్డు తమలో మరింత బాధ్యతను పెంచిందని, సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ నెల 1న ఉత్తరప్రదేశ్ అహ్మదాబాద్‌లో ఈ అవార్డును అందుకోవాల్సి ఉందని, అనివార్య కారణాలతో హాజరు కాకపోవడంతో కొరియర్ ద్వారా దీన్ని నిర్వాహకులు పంపించారని తెలిపారు.
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు పయనం
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు పయనం


