శృంగార వల్లభ స్వామి ఆలయం కిటకిట
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 14వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,42,290 అన్నదాన విరాళాలు రూ.67,143, కేశ ఖండన ద్వారా రూ.5,239, తులాభారం ద్వారా రూ.300, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,635 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.


