వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
అల్లవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల ప్రైవేటీకరణతో విద్య, వైద్యం వ్యాపారమయంగా మారతాయని, దోపీడీ యథేచ్ఛగా జరుగుతుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వివిధ నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులను సోమవారం జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో రైతు విభాగం, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలనే సంకల్పం, నిధుల మంజూరు, స్థల సేకరణ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనని చెప్పారు. వీటిలో ఐదు కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారని, రెండు పూర్తి కావచ్చాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందన్నారు. వారికి కావాల్సిన వ్యక్తులకు ధారాదత్తం చేసి వైద్యం, విద్యను వ్యాపారమయం చేస్తోందని తెలిపారు. ఓ వైపు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ.. మరోవైపు వాటిల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడం దేనికని ప్రశ్నించారు.
మాదిగలకు ఎమ్మెల్సీ పదవి
ఇచ్చిన ఘనత జగన్‌దే
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అమలాపురంలో మాదిగ ఆత్మీయ కలయిక విజయవంతమైన సందర్భంగా ఆయన శనివారం అమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగలకు సముచిత స్థానం ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి పట్ల తాను కృతజ్ఞతతో ఉండటం తప్పా అని ప్రశ్నించారు. కొందరు కూటమి నాయకులు ఆత్మీయ కలయికను అడ్డుకున్నారన్నారు. కోనసీమలో మాదిగలకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే టిక్కెట్లును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆత్మీయ కలయిక విజయవంతం చేసిన దండోరా నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం


