రేపు అమలాపురం నుంచి తాడేపల్లికి..
● ఏడు నియోజకవర్గాల కోటి సంతకాల ప్రతుల తరలింపు
● అమలాపురంలో పాదయాత్ర
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
అమలాపురం టౌన్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను సోమవారం ఉదయం 9 గంటలకు అమలాపురం నుంచి విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా తరలిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు,అమలాపురం, పి.గన్నవరం నియోజకర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, జిల్లా పార్టీ నాయకులతో కలిసి జగ్గిరెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. అమలాపురంలో సోమవారం నిర్వహించే పాదయాత్ర, పార్కింగ్ ప్రదేశాన్ని జగ్గిరెడ్డి తదితరులు పరిశీలించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి కోటి సంతకాల ప్రతులతో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు గడియారం స్తంభం సెంటర్, మెయిన్ రోడ్డు, ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు, ఈదరపల్లి వంతెన వరకూ పాదయాత్ర నిర్వహిస్తారని జగ్గిరెడ్డి తెలిపారు.
తాడేపల్లికి ర్యాలీగా..
అమలాపురానికి తరలి వచ్చే పార్టీ నాయకుల వాహనాలను స్థానిక హైస్కూల్ సెంటర్ సమీపంలోని వెంకట రమణ థియేటర్ (కూల్చిన) ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని జగ్గిరెడ్డి సూచించారు. ఈదరపల్లి వంతెన నుంచి కోటి సంతకాల ప్రతుల వాహనాలతో పాటు జిల్లా పార్టీ శ్రేణులు ర్యాలీగా తాడేపల్లికి బయలుదేరతారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల కోటి సంతకాల సేకరణ ప్రతులు అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని పార్టీ పీఏసీ సభ్యుడు, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఇంటికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం వెంకట రమణ థియేటర్ ఖాళీ స్థలాన్ని, పాదయాత్ర సాగే హైస్కూల్ సెంటర్, గడియారం స్తంభం సెంటర్, ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు, ఈదరపల్లి వంతెన ప్రాంతాల్లో పర్యటించారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వంటెద్దు వెంకన్నాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ బూత్ కమిటీల జిల్లా కన్వీనర్ చీకట్ల కిషోర్, పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులి నాని, పార్టీ నాయకులు కల్వకొలను ఉమ, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


