రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు.
తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు
ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంలో ఉంచి ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేసిన అనంతరం దేవస్థానం ఈఓ వీ త్రినాథరావు కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రొచ్ఛాటన మధ్య, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు.


