ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
రాయవరం: జవహర్ నవోదయ సమితిలో ఐదో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లలోని 15 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా 3,046 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 2,645 మంది రాశారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు, రామచంద్రపురం, అమలాపురం ఉపవిద్యాశాఖ అధికారులు పి.రామలక్ష్మణమూర్తి, జి.సూర్యప్రకాశరావు, స్థానిక మండల విద్యాశాఖాధికారులు పరిశీలించారు.
నేటి నుంచి ఇంధన
పొదుపు వారోత్సవాలు
అమలాపురం రూరల్: జిల్లాలో ఆదివారం నుంచి ఈ నెల 20 వరకూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తామని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజేశ్వరి తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్ కేంద్రాల పరిధిలో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు, స్వయం సహాయక మహిళా బృందాలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు. వారికి ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత – నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్క్‌షాపులు జరుగుతాయని, వినియోగదారులకు అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
18 నుంచి విద్యార్థులకు పోటీలు
అమలాపురం రూరల్: జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 18 మంది 24వ తేదీ వరకూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ శనివారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 2025 సంవత్సరానికి డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం అనే ఇతివృత్తంతో వేడుకలను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పార సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించిందన్నారు. న్యాయపాలనతో సమర్థ, సత్వర పరిష్కారం అంశంపై విద్యార్థులకు తెలుగు, ఆంగ్లభాషల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.7,500, రూ.5 వేలతో పాటు ప్రశంసా పత్రాలను బహూకరిస్తారన్నారు. జిల్లా స్థాయిలో రూ.5 వేలు (ప్రథమ), రూ.3 వేలు (ద్వితీయ), రూ.2 వేలు (తృతీయ) బహుమతులుగా అందజేస్తారన్నారు.
ఎయిర్‌పోర్టులో డ్రై రన్
కోరుకొండ: విమాన సర్వీసుల రాకపోకలకు ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత విమానాశ్రయాల అథారిటీ (ఏఏఐ) ఆధ్వర్యంలో శనివారం మధురపూడిలోని విమానాశ్రయంలో డ్రై రన్ నిర్వహించారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా ఏర్పడే అవరోధాలను అధిగమించి విమాన సేవలందించడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్‌కే శ్రీకాంత్ సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సర్వీసుల రాకపోకల్లో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏటీసీ, ఆపరేషన్లు, ఇంజినీరింగ్, ఏఆర్‌ఎఫ్‌ఎఫ్ విభా గాలకు చెందిన అధికారులతోపాటు, ఇండిగో, అలయన్స్ ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.
స్క్రబ్ టైఫస్‌పై అపోహలొద్దు
రాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్‌పై అపోహలు అవసరం లేదని, సకాలంలో గుర్తిస్తే నయం అవుతుందని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే వేంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో ప్రచురితం అవుతున్న వార్తల నేపథ్యంలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పొదలు, గడ్డి ప్రాంతాల్లో నివసించే నల్లి లార్వా (చిగ్గర్ మైట్స్) కాటు ద్వారా మాత్రమే మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు.


