కోడి రెఢీ.. | - | Sakshi
Sakshi News home page

కోడి రెఢీ..

Dec 14 2025 8:46 AM | Updated on Dec 14 2025 8:46 AM

కోడి

కోడి రెఢీ..

సాక్షి, అమలాపురం: సంక్రాంతి పందేలకు పుంజులు సిద్ధమవుతున్నాయి. పందేల బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్థక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగ సమీపిస్తుండటంతో వీటి అమ్మకాలు జోరందుకోనున్నాయి. కాకి, నెమలి, డేగ, సేతువ, రసంగి..ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెఢీ అంటున్నాయి.

కోడి పందేలకు ప్రాధాన్యం

సంక్రాంతి అంటే వాకిట ముందు రంగవల్లులు, వాటిలో గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలు, పిండి వంటలు, తీర్థాలు మాత్రమే కాదు కోడి పందేలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందేలు జరగాల్సిందే. రాష్ట్ర నలుమూలల నుంచే కాదు తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ కోడి పందేలు చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కోట్ల రూపాయల మేర సాగే పందేల్లో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. పందేలు అడ్డుకుంటామని పోలీసులు ఏటా క్రమం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నా పందేలు మాత్రం జరగకుండా ఆగవు. అటువంటి పందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి.

ముమ్మరంగా శిక్షణ

సంక్రాంతి క‘ధన’ రంగంలో దూకేందుకు పందెంకోళ్లు సిద్ధమవుతున్నాయి. పందేల నిర్వాహకులు, శిక్షకులు కత్తులు నూరుతూ ప్రత్యేక శ్రద్ధతో వీటిని పెంచుతున్నారు. రోజూ రీహార్సల్స్‌ వేయిస్తూ శిక్షణ ఇస్తున్నారు. సంక్రాంతి పండగకు నెల రోజుల కన్నా తక్కువ రోజులు మాత్రమే సమయం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పందెం రాయుళ్లు పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

ప్రత్యేక తర్ఫీదు

పందెం పుంజులకు బలవర్థక ఆహారం అందిస్తూ, వాటికి ప్రత్యేక తర్ఫీదును ఇవ్వడంతో పాటు పలు మెళకువలు నేర్పిస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. పందెం పుంజుల్లో పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల కొక్కిరాయి, సేతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షల రూపాయలు చేతుల మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు.

కోనసీమ కోళ్లకు డిమాండ్‌

కోడిపందేలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన పశ్చిమ గోదావరికి సైతం కోనసీమ కోళ్లు వెళుతున్నాయి. అక్కడ పందేలలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు కోనసీమ నుంచి కోళ్లను పట్టుకుని వెళుతున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, ఉప్పలగుప్తం, మలికిపురం తదితర మండలాల్లో వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. కొబ్బరి తోటల చుట్టూ ప్రత్యేక ఫెన్సింగ్‌ వేసి వీటిని రక్షణ కల్పిస్తున్నారు. కొంతమంది రైతులకు, ఇతరులకు పందెం కోళ్ల పెంపకం లాభదాయకంగా మారింది.

సంప్రదాయం పేరుతో..

కోడి పందేలు నిర్వహించరాదని, నిర్వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంప్రదాయం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ముందుండి ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భోగి పండగ నుంచి ముక్కనుమ వరకు రాత్రి, పగలూ తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పోటీలు నిర్వహించారు. తొలుత కత్తుల కట్టకుండా డిక్కీ పందేలు ఆడించి అనంతరం కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా గతేడాది కూడా జిల్లా అంతా యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించిన విషయం జిల్లా ప్రజలకు విదితమే.

ఇనుప గాబుల్లో పందెం కోళ్లు

పందెం వేస్తున్న నిర్వాహకులు

పందేలకు కాలు దువ్వుతున్న పుంజులు

ప్రత్యేక శిక్షణ, బలవర్ధక ఆహారం

సిద్ధం చేస్తున్న పందెం రాయుళ్లు

శిబిరాల్లో ముమ్మరంగా పెంపకం

రూ.10 వేల నుంచి ధర ప్రారంభం

రాజభోగం

బాదంపప్పు, జీడిపప్పు, మటన్‌్‌ కై మా, తాటిబెల్లం, నువ్వులనూనెతో చేసిన ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని పుంజులకు అందిస్తారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తారు. ఆ తర్వాత వాకింగ్‌ చేయించి కొద్దిసేపు ఎండలో కడతారు. 9 గంటలకు అల్పాహారం కింద బాదంపప్పు, జీడిపప్పు, మటన్‌ కై మా పెడతారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటిని తినిపిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేత పెడతారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలోని గాబుల్లో ఉంచుతారు. సాయంత్రం ఆరు గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి దానిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూయడం చేస్తారు. ఆ తర్వాత రెవిటాల్‌ వంటి బలవర్థక మందులు వేస్తారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద పుంజులను రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తారు.

కోడి రెఢీ..1
1/2

కోడి రెఢీ..

కోడి రెఢీ..2
2/2

కోడి రెఢీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement