సాక్షి, అమలాపురం: ‘సైన్యార్’ తుపాను ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఆల్పపీడనం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే గత నెలలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం.. తర్వాత మోంథా తుపాను దెబ్బకు కుదేలైన ఖరీఫ్ రైతులకు తాజా హెచ్చరిక గుండెల్లో కలవరం రేపుతోంది. ఈ క్రమంలో ఉరుకులు, పరుగులపై మాసూళ్లను ముమ్మరం చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, హిందూ మహా సముద్రం సమీపంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని, ఇది వాయువ్య దిశగా కదులుతూ గురువారం వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలకు తోడు, జిల్లాలో మారిన వాతావరణం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేయగా, మంచి దిగుబడి వస్తోందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో అల్పపీడనం, తుపాను గాలులు, వర్షాల వల్ల చేలు నీట మునగడం, నేలనంటడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో సాగులో ముఖ్యమైన వరి పంట 55,115 ఎకరాల్లో నేలనంటగా, 21,594 ఎకరాల్లో నీట మునిగింది. మొత్తం 76,709 ఎకరాల్లో పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో నష్టం జరగ్గా, ఇందులో ఒక్క అరటి పంటే 3,879 ఎకరాలు ఉంది. ఆ విపత్తు నుంచి కోలుకుని రైతులు మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకుంటున్నారు. జిల్లాలో వరి మాసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 53 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. యంత్రాలు, కూలీలతో కోతలు చేయిస్తున్నారు. తూర్పు డెల్టాలోని ఆలమూరు, రామచంద్రపురం, మధ్య డెల్టాలో కొత్తపేట, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో కోతలు, నూర్పుళ్లు అధికంగా జరుగుతున్నాయి. సాగు ఆలస్యంగా ప్రారంభించిన మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్లలో కోతలు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు.
నిబంధనలతో దూరం
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ నిబంధన వల్ల రైతులు వారికి దూరంగా ఉంటున్నారు. దెబ్బతిన్న ధాన్యాన్ని రైతులు ఎండబెట్టేందుకు అధిక సమయం తీసుకుంటున్నారనేది అధికారులు చెబుతున్న కారణం. రైతులు సమీపంలోని రోడ్లు, కళ్లాల్లో పెద్దఎత్తున ధాన్యం నిల్వ చేస్తున్నారు. యంత్రాలతో కోతల వల్ల ధాన్యం తేమ 24 శాతం వరకు వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది 17 శాతం లోపు ఉండాలి. ఇందుకుగాను రైతులు ఎక్కువ రోజులు ఎండబెడుతున్నారు. శీతాకాలం మంచు అధికంగా కురుస్తుండడం వల్ల వేగంగా ఎండడం లేదని, సమయం ఎక్కువ అవుతుందని రైతులు చెబుతున్నారు. మాసూళ్లు జరుగుతున్న సమయంలో వాయుగుండం హెచ్చరికలు అన్నదాతను హైరానా పడేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఓసారి దెబ్బతిన్న రైతులు.. మరోసారి విపత్తును ఎదుర్కొనే స్థితిలో లేరు. ఈ కారణంగా మాసూళ్లను వేగవంతం చేస్తున్నారు. అలాగే ఎండబెడుతున్న ధాన్యాన్ని రాశులుగా పోసి, కుప్పలు వేసి బరకాలు కప్పుతున్నారు. చేల మీద ఉన్న పనలను మెరక ప్రాంతాలకు తీసుకువెళ్లి కళ్లాల్లో వేసుకుంటున్నారు. గత నెలలో తుపాను, వర్షాలకు జరిగిన నష్టం వల్ల పంట దిగుబడులు కోల్పోయామని, ఇప్పుడు వర్షాలు వస్తే మొత్తం పంటను వదులు కోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.
బంగాళాఖాతంలో
అల్పపీడన ప్రభావం
ముంచుకొస్తున్న తుపాను ముప్పు
జిల్లాలో 1.53 లక్షల
ఎకరాల్లో ఖరీఫ్ సాగు
70 వేల ఎకరాల్లో కోతలు పూర్తి
మందకొడిగా ధాన్యం కొనుగోలు
మోంథా తుపానుకు
70 వేల ఎకరాల్లో పంట నష్టం
మరోసారి వస్తే సర్వం
కోల్పోతామని రైతుల ఆవేదన
అన్నదాత హైరానా


