సాగునీటి ప్రణాళికలపై సమీక్ష
ధవళేశ్వరం: గోదావరి డెల్టా పరిధిలో నీటి లభ్యత, ఆయకట్టు, సాగు ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షత వహించారు. గోదావరి తూర్పు, మధ్య , పశ్చిమ డెల్టాల పరిధిలోని మొత్తం 8,96,533 ఎకరాలకు అవసరమయ్యే 93.26 టీఎంసీల నీటి లభ్యత, సీలేరు, పోలవరం నిల్వలు, డిసెంబర్ – మార్చిలో అంచనా ఇన్‌ఫ్లోపై సమీక్షించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రబీ 2025–26 పంట సాగు సమయానికి అవసరమైన నీటి పంపిణీ, కాలువల సంరక్షణ, ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన ప్రాథమిక వివరాల నివేదికను శనివారానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ సిబ్బందిని సమన్వయం చేసి 60 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. షట్టర్ల మరమ్మతులు, బండ్ల పటిష్టత, కాటన్ మ్యూజియం నిర్వహణ వంటి అంశాల్లో దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.గోపీనాథ్ మాట్లాడుతూ గోదావరి డెల్టాకు సంబంధించిన ఆయకట్టు, నీటి అవసరత, లభ్యత వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


