నాలుగేళ్లుగా కోనసీమ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు ఇలా..
సంవత్సరం హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు గర్భిణులకు పరీక్షలు పాజిటివ్ కేసులు
2022–23 47,291 358 30,320 2
2023–24 44,468 392 26,407 7
2024–25 45,913 311 17,866 9
2025–26 31,280 125 16,643 4
(అక్టోబర్ వరకు)
రాయవరం: హెచ్‌ఐవీ నియంత్రణకు సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం. సమాజంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిగా వేళ్లూనుకుంది. గతంలో ఈ వ్యాధిపై నలుగురిలో మాట్లాడాలంటే సంశయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్ద కాలానికి ముందు చాపకింద నీరులా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సురక్షితం కాని శృంగారం ఎంత ప్రమాదకరమో కరపత్రాల ద్వారా చాటి చెప్పడంతో క్రమంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. బహిరంగ చర్చ సాధారణం కావడంతో, కొన్నేళ్లుగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. డిసెంబరు ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
హెచ్‌ఐవీ అంటే..
హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) అనేది ఎయిడ్స్ (ఎకై ్వర్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్)ను కలగజేస్తుంది. లైంగికంగా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో రక్తం ఎక్కించడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ బలహీనపరిచి, క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణింపజేస్తుంది.
క్రమంగా తగ్గుతున్న బాధితులు
జిల్లాలో 2022–23లో 0.78 శాతం ఉన్న హెచ్‌ఐవీ వ్యాప్తి.. 2024–25 నాటికి 0.63 శాతంగా ఉంది. 2025–26లో అక్టోబర్ నాటికి 0.40 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 31,280 మందిని పరీక్షించగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే 16,643 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో నలుగురికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. గర్భిణుల్లో మాత్రం 2022–23 నుంచి గతేడాది వరకు కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.
ఈ ఏడాది నినాదమిదే..
‘అంతరాయాన్ని అధిగమించడం.. ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఏటా డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది ఓవర్‌కమింగ్ డిజరప్షన్, ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. అందరితో పాటు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్నదే దీని ఉద్దేశం.
జిల్లాలో పరిస్థితి ఇలా..
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు జిల్లాలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2000–2001లో 4,600 కేసులు నమోదు కాగా, 2005–06లో 6,107 కేసులు నమోదయ్యాయి. 2009–10లో ఈ సంఖ్య 8,933కు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో హెచ్‌ఐవీపై ప్రకటించిన యద్ధం కారణంగా అన్ని స్థాయిల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అభినందనీయం. 2020–21లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి 3,933కు చేరింది. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 31,280 మందికి పరీక్షలు చేయగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు 358 పాజిటివ్ కేసులు తేలాయి. 2023–24లో 392, 2024–25లో 311 పాజిటివ్ కేసులు గుర్తించారు.
కోనసీమలో చికిత్స కేంద్రాలివే..
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు అమలాపురం, రామచంద్రపురంల్లో ఏఆర్‌టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే రాజోలు, కొత్తపేట, మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు, కిమ్స్ ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని నెలకొల్పారు. ప్రతి ఆస్పత్రిలో హైరిస్క్ వ్యాధిగ్రస్తులకు హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఆరు నెలలకు వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి గర్భిణీకి హెచ్‌ఐవీ టెస్ట్‌లు చేస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన హెచ్‌ఐవీ కేసులు
వ్యాధిగ్రస్తుల జీవన శైలి మెరుగుకు కృషి
కోనసీమలో 2022–23లో
358 కేసులు..
ఈ ఏడాది ఇప్పటి వరకు 125 గుర్తింపు
డిసెంబర్ ఒకటిన
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
కట్టడికి చర్యలు
జిల్లాలో హెచ్‌ఐవీ సమస్య అదుపులోనే ఉంది. దీని తీవ్రత తెలుసుకున్న చాలా మంది అప్రమత్తంగా ఉంటున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ నుంచి బాధితుల రక్షణకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం.
– డాక్టర్ భరతలక్ష్మి, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ,
టీబీ నివారణ అధికారి,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నాలుగేళ్లుగా కోనసీమ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు ఇలా..


