స్కూళ్లలో రాజ్యాంగ దినోత్సవం చేయరా..?
అమలాపురం రూరల్: రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సెలవు ఎందుకు ప్రకటించారంటూ డీఈవో ఎస్‌కే సలీం బాషాను దళిత నాయకులు నిలదీశారు. పాఠశాలల్లో ఎందుకు రాజ్యాంగ దినోత్సవం జరపలేదని ప్రశ్నించారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు హైస్కూల్‌లో బుధవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన డీఈవో సలీం బాషాను మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జల్లి శ్రీనివాసరావు, నాయకులు నాతి శ్రీనివాసరావు, దేవరపల్లి వీరేష్‌కుమార్‌తో పాటు, పలువురు కలిశారు. పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలంటూ జీవో విడుదలైనప్పుడు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారో చెప్పాలంటూ పట్టుబట్టారు. ఉద్దేశపూర్వకంగా సెలవు ప్రకటించినట్టుగా కనిపిస్తుందని మండిపడ్డారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి దళిత నాయకులకు వత్తాసు పలికారు. ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు.
డీఈవోను నిలదీసిన దళిత నాయకులు


