మీరూ ముంచేస్తారా.. బాబూ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెనుగాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడిన మోంథా తుపాను ఇప్పటికే రైతులను నిండా ముంచేసింది. ఈ పరిస్థితుల్లో వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కొండంత ధైర్యాన్నివ్వాలి. పంట నష్టపోయిన రైతులకు బీమాతో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలి. దీంతో పాటు మిగిలిన పంటను కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) ద్వారా కొనుగోలు చేసి, వారిని ఒడ్డున పడేయాలి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను మరింతగా ముంచేసేలా ఉన్నాయని రైతులు కలత చెందుతున్నారు. విపత్తులతో పంట ముంపునకు గురైతే క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలన జరిపి, జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందిస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వమే బాధిత రైతులకు పరిహారం అందిస్తుంది. కానీ, కూటమి సర్కారు నష్టపరిహారాన్ని తగ్గించేందుకు, వీలైనంతగా ఎగ్గొట్టేందుకు సాంకేతిక కారణాలతో కొర్రీలు వేస్తోందని, నష్టం అంచనాలు రూపొందించే ప్రక్రియకు రైతులను దూరం పెట్టే ఆలోచనలు చేస్తోందని, పండించిన పంట కొనుగోలు చేయకుండా గతంలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతోందని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
సీఎంఆర్‌కు నో!
తుపానుతో నష్టపరిహారం అందుకునే రైతులు పండించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్‌ఆర్) ద్వారా కొనుగోలు చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు జిల్లాలకు ఉత్తర్వులు వచ్చినట్టు రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్న రైతుల వద్ద ముంపులో ఉన్న పంటను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ మేరకు మండల స్థాయిలో టాంటాంలు కూడా వేయించింది. రెండు రోజుల క్రితం కరప తదితర మండలాల్లో ఈ విధంగా టాంటాంలు వేయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వలన రైతులు భయపడి, తమకు పంట నష్టం జరిగినట్లు దరఖాస్తు చేయకుండా వెనక్కు తగ్గుతారనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ప్రకటించింది. ఇదే తరహాలో ఇక్కడ కూడా ప్రకటిస్తే.. ఆ మేరకు పరిహారం అందుకునే రైతుల సంఖ్యలో కోత పెట్టేందుకే కూటమి సర్కారు ఇటువంటి నిబంధన తెచ్చిందని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తుపానుకు పోయిన పంట ఎలాగూ పోయింది.. మిగిలినదైనా కస్టమ్ మిల్లింగ్‌లో అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వం ఆ అవకాశం కూడా లేకుండా చేస్తోందని, తద్వారా ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకుంటోందని రైతులు మండిపడుతున్నారు.
మానవత్వం మరచి..
రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన ఓ రైతు అంతా సవ్యంగా సాగితే 90 నుంచి 120 బస్తాల (75 కేజీలు) దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. తీరా చూస్తే పంటంతా తుపానుతో మునిగిపోయింది. ఇప్పుడు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తే గొప్పేననే పరిస్థితి. ఈ లెక్కన రెండున్నర ఎకరాలకు 40 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే తుపానుతో ఆ రైతు సగటున 60 బస్తాలు పైనే కోల్పోతున్న పరిస్థితి. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.5 వేలు వస్తుందని లెక్క వేసినా రెండున్నర ఎకరాలకు రూ.12,500కు మించి ఒక్క పైసా కూడా రాదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యమంటున్న రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పలాయన మంత్రం పఠిస్తోందని రైతు ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. నష్టపరిహారం పొందితే సీఎంఆర్ ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించే అవకాశం లేకుండా చేయడం అన్యాయమంటూ రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు వచ్చే ధాన్యంలో తేమ, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో మద్దతు ధర ఇవ్వడానికి మిల్లర్లు ముందుకు రారు. అటు ప్రభుత్వం ఎంఎస్‌పీకి కొనదు. దీంతో, మిల్లర్లు, దళారులు చెప్పిందే రేటు అనే పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే ప్రతి బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకూ నష్టం తప్పదని వాపోతున్నారు. మిల్లర్లకు పరోక్షంగా అయాచిత లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లూ జగన్ అండ
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విపత్తులతో పంట నష్టం జరిగిన అన్ని సందర్భాల్లోనూ ప్రతి రైతుకూ సీజన్ ముగియకుండానే పరిహారం నేరుగా అందించింది. రైతుల విజ్ఞాపన మేరకు తేమ శాతం నిబంధనను 20 నుంచి 22 శాతం వరకూ పెంచి, కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది.
ఇది అన్యాయం
నష్ట పరిహారానికి, ధాన్యం కొనుగోలుకు ముడి పెట్టడం అన్యాయం. తుపానుతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి ఇలాంటి నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. నష్టపరిహారం పొందిన రైతుల నుంచి సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని అంటే ఏమైపోవాలి? ఈ మాట చాలా వింతగా ఉంది. ఇది సరైన విధానం కాదు. ముంపుతో పోయిన ధాన్యం ఎలానూ పోయింది. కనీసం మిగిలిన ధాన్యాన్నయినా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనుకుంటే ఇప్పుడు ఇలా చెప్పడం అన్యాయం. ప్రభుత్వం పరోక్షంగా దళారులను ప్రోత్సహించినట్టే. ఈ విధానాన్ని విరమించుకోవాలి.
– బదిరెడ్డి వీర ప్రకాశరావు, రైతు,
వీకే రాయపురం, సామర్లకోట మండలం
మోంథా తుపానుతో కోనసీమ జిల్లాలో వరికి నష్టమిలా..
సాగు విస్తీర్ణం 1.63 లక్షల ఎకరాలు
పంట నష్టం 77,560 ఎకరాలు
నష్టపోయిన రైతులు 55,000
దిగుబడి అంచనా 4.48 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు లక్ష్యం 4.48 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటికే ముంచేసిన ‘మోంథా’
రైతులకు పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు ఎత్తులు
ఆ సాయం చేస్తే ధాన్యం కొనబోమని మెలిక
మరోవైపు కస్టమ్ మిల్లింగ్‌కూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
ఇటు పరిహారం రాదు.. అటు బీమా అందదు
ఇప్పుడు ధాన్యం కొనుగోలుకూ ససేమిరా
తుపాను బాధిత రైతులపై సర్కారు నిర్దయ
							మీరూ ముంచేస్తారా.. బాబూ!

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
