అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
అమలాపురం రూరల్: అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి సుమారు 270 అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్వో కె.మాధవి, డీపీఓ శాంతలక్ష్మి, డీఎల్‌డీఓలు రాజేశ్వరరావు, వేణుగోపాల్, డీఈఓ సలీం బాషా, డీఎస్‌ఓ అడపా ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 40 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎీస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌లు వేర్వేరుగా తమ చాంబర్లలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి ఎస్పీ, ఏఎస్పీలకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి చర్చించి అర్జీల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉండడంతో వారు బాధితులతో కౌన్సెలింగ్ మాదిరిగా మాట్లాడి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్
పోటీలకు ఎంపిక
రాయవరం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడని హెచ్‌ఎం వీఎస్ సునీత సోమవారం విలేకరులకు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థి చెన్నూరి మహేష్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడన్నారు. అథ్లెటిక్స్ 4/100 రిలే విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని వివరించారు. ఈ నెల 7న శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థికి తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు చిక్కాల అజ్జిబాబు, కె.శ్రీనివాస్, మహేష్‌లను హెచ్‌ఎం సునీతతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
వివాహానికి పార్కింగ్ స్థలం
● అద్దెకిచ్చిన అన్నవరం దేవస్థానం
సీఆర్‌ఓ అధికారులు
● పెళ్లి సెట్టింగ్‌ను అడ్డుకున్న
ఇంజినీరింగ్ అధికారులు
● చైర్మన్ ఆగ్రహం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (సీఆర్‌ఓ) విభాగం అధికారుల నిర్వాకానికిదో మచ్చుతునక. వివరాలివీ.. కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారి వాహనాల పార్కింగ్‌కు సత్యగిరిపై హరిహర సదన్ సత్రం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అయితే, ఇదే స్థలాన్ని సీఆర్‌ఓ అధికారులు ఈ నెల 8న జరిగే వివాహానికి అద్దెకివ్వడం వివాదాస్పదమైంది. ఆ పెళ్లి బృందం వారు ఆ స్థలంలో ఐదు రోజుల ముందు నుంచే వివాహ సెట్టింగ్ వేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన దేవస్థానం ఇంజినీరింగ్ ఈఈ రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. ఆ స్థలాన్ని తాము ముందుగానే రిజర్వ్ చేసుకున్నామని ఆ పెళ్లి బృందం వారు చెప్పడంతో విషయాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఆర్‌ఓ అధికారులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేలాదిగా భక్తులు తరలి వస్తారని, వారి వాహనాలను అక్కడే నిలపాల్సి వస్తుందని, అలాగే, ఎనిమిదో తేదీ శనివారం కూడా రద్దీ ఉంటుందని, ఇవేమీ చూసుకోకుండా ఆ స్థలాన్ని పెళ్లికి రిజర్వ్ చేశారని ప్రశ్నించారు. భక్తుల వాహనాలు నిలిపే స్థలాలను కార్తిక మాసం పూర్తయ్యేంత వరకూ వివాహాలకు ఇవ్వవద్దని ఆదేశించారు.
							అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
							అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
