తూడుచిపెట్టిన నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

తూడుచిపెట్టిన నిర్లక్ష్యం

Nov 4 2025 7:02 AM | Updated on Nov 4 2025 7:02 AM

తూడుచిపెట్టిన నిర్లక్ష్యం

తూడుచిపెట్టిన నిర్లక్ష్యం

ప్రధాన డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క

నిధులున్నా పనులు చేయని

ప్రాజెక్టు కమిటీ

అంతా మునిగాక ఇప్పుడు చేపట్టిన వైనం

మండిపడుతున్న ఆయకట్టు రైతులు

సాక్షి, అమలాపురం: రైతులకు మేలు చేసేందుకు ఏర్పడిన నీటి సంఘాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి.. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో చేయక పంటలు నీట మునిగి దెబ్బతినే పరిస్థితులు తెచ్చాయి.. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు ముంపునకు కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో దొడ్డిదారిన ఏర్పడిన గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ నిర్లక్ష్యమే కారణమైంది.

జిల్లాలో కీలకమైన పది మేజర్‌ డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు కేటాయించింది. కూనవరం, లోయర్‌ కౌశిక, అప్పర కౌశిక, సాకుర్రు, వృద్ధ గౌతమీ, అమలాపురం, దసరా బుల్లోడు కోడు, వాసాలతిప్ప వంటి డ్రెయిన్లలో పనులకు ప్రభుత్వం నిర్వహణ నిధులు కేటాయించింది. ఈ పనులను వర్షాలు రాక ముందే చేపట్టాల్సి ఉంది. కానీ నామినేషన్‌ పద్ధతిలో పనులు చేపట్టిన ప్రాజెక్టు కమిటీ తూడు, గుర్రపు డెక్క తొలగించిన పాపాన పోలేదు. ఈ ఏడాది నైరుతిలో లోటు వర్షం కలిసి వచ్చింది. అయినా అరకొరగా పనులు చేసి వదిలేసింది. నాల్గో వంతు కూడా పనులు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. సీజన్‌ పూర్తయిన తరువాత మొత్తం బిల్లులు చేసుకునే పనిలో ఉంది.

కానీ గత నెల మూడో వారంలో అల్పపీడనం ప్రభావం వల్ల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో చేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ముంపు తగ్గుతున్న సమయంలో బంగాళాఖాతంలో మోంథా తుపాను వల్ల మళ్లీ వర్షాలు కురిశాయి. ఈ రెండు సార్లు వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. పది మేజర్‌ డ్రెయిన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. సకాలంలో తూడు, గుర్రపుడెక్క తొలగించపోవడంతో చేల నుంచి ముంపునీరు వీడడం లేదు. దీనివల్ల పంట పెద్ద ఎత్తున కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది.

ప్రాజెక్టు కమిటీదే ముంపు పాపం

అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో ప్రవహిస్తున్న పది ప్రధాన మురుగునీటి కాలువల్లో గుర్రపుడెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. తమ చేల ముంపునకు ప్రాజెక్టు కమిటీదే పాపమని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ ద్వారా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనూ ఇదే విధంగా చేసేవారు. అప్పుట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి గోదావరి ప్రాజెక్టు కమిటీ (ఇప్పుడు దీనిని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలుగా విడదీశారు) ఈ పనులు నిర్వహించేది. ఇప్పుడు మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ ఈ పనులు చేసింది. పేరుకు ప్రాజెక్టు కమిటీ పనులు చేయాల్సి ఉన్నా ఈ పనులను తమ పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ), వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూయూఏ)లకు అప్పగించి పనులు చేసేవి. ఐదారు గ్రామాల పరిధిలో ఉండే డబ్ల్యూయూఏ, రెండు, మూడు మండలాల పరిధిలో ఉండే డీసీలు ఎంతోకొంత జవాబుదారీతనం కోసమైనా పనులు చేసేవి. పైగా నీటి సంఘాలను ఎన్నికల ద్వారా నిర్ణయించేవారు. కూటమి ప్రభుత్వంలో ఈ ఎంపికలను మమ అనిపించారు. గతంలో ప్రాజెక్టు కమిటీలో చేసిన అనుభవం ఉన్నవారిని పక్కనబెట్టి తమ రాజకీయ అవసరాల మేరకు కూటమి ఎమ్మెల్యేలు అనుభవం లేని వారిని ఎంపిక చేశారు. ఇదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. దీనికితోడు ప్రాజెక్టు కమిటీలోని కీలక వ్యక్తి పనులు చేపట్టి వాటిని చేయకుండా ఇప్పుడు ముంపునకు కారణం కావడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేతులు కాలిన తరువాత

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన జరగాల్సిన నష్టం జరిగిన తరువాత జిల్లా యంత్రాంగం నిద్ర లేచింది. ప్రాజెక్టు కమిటీ నిర్వాకంపై ఇటీవల వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆధ్వర్యంలో రైతు సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికప్పుడు పనులు చేపట్టారు. అది కూడా వేగంగా చేస్తున్న దాఖలాలు లేవు. అరకొరగా పనులు చేపడుతున్నారు. కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పూర్తయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ముంపునీరు దిగక వరి చేలు కుళ్లిపోవడం, మొలకలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల జిల్లాలో పంట నష్టం మరింత పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement