
పేద మహిళకు ఉచితంగా శస్త్ర చికిత్స
సత్య సాయి సేవా సంస్థల రూ.58 వేల వితరణ
అమలాపురం టౌన్: సత్యసాయి సేవా సంస్థలు ఓ పేద మహిళకు హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సను ఉచితంగా నిర్వహించే ఏర్పాట్లు చేసింది. అమలాపురం డివిజన్ సత్య సాయి సేవా సంస్థలు భగవాన్ సత్య సాయిబాబా అవతార శతాబ్ది మహోత్సవాల సందర్భంగా 100 గ్రామ సేవల నిర్వహణలో భాగంగా రూరల్ మండలం పాలగుమ్మి శివారు కంభంపాడులో బుధవారం సేవా కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన సరెళ్ల బేబీ కడుపులో కంతి పెరిగి నొప్పి, రక్త స్రావంతో బాధ పడడాన్ని సేవకులు గుర్తించారు. దానిని తొలగించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సేవా సంస్థ కోఆర్డినేటర్ డాక్టర్ జి.ప్రభాకర్ రూ.58 వేల ఆర్థిక సాయం చేశారు. దీంతో అమలాపురంలోని శ్రావణి ఆస్పత్రిలో డాక్టర్ శ్రావణి కేవలం శస్త్రచికిత్సకు అయ్యే రూ.48 వేలను మాత్రమే తీసుకుని ఆమెకు చికిత్స చేశారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ ప్రభాకర్ తెలిపారు.
యువకుడి అదృశ్యం
పెరవలి: మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన తోట వెంకట సత్యనారాయణ ఈ నెల 25 తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తల్లి భవాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. సత్యనారాయణ తణుకులోని ఒక ప్రేవేట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడని, 25 తేదీన సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్యనారాయణ ఆచూకీ తెలిసిన వారు 94407 96642 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

పేద మహిళకు ఉచితంగా శస్త్ర చికిత్స