
రత్నగిరిపై అగ్నిప్రమాదం
● ఫ్యాన్సీ దుకాణం గోదాములో ఘటన
● రూ.పది లక్షల ఆస్తి నష్టం
● ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్
కారణమంటున్న అధికారులు
అన్నవరం: రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం వద్ద గల ఫ్యాన్సీ షాపు గోడౌన్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఫ్యాన్సీ షాపు నిర్వాహకుడు దాని వెనుక గోడౌన్ ఏర్పాటు చేసుకుని ప్లాస్టిక్ వస్తువులు, ఫొటోలు, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లు పెట్టుకున్నాడు. ఉదయం ఏడు గంటల సమయంలో ఆ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 8 ప్రిజ్‌లతో సహా సుమారు రెండు లారీల సరకు కాలి బూడిదైంది. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోయి ఉంటే షాపింగ్ కాంప్లెక్స్‌కు మంటలు వ్యాపించి రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని స్థానికులు చెప్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలియగానే దేవదాయశాఖ ఆర్‌జేసీ వి.త్రినాథరావు, పెద్దాపురం ఆర్డీఓ రమణి వచ్చి ఆ గోడౌన్‌ను పరిశీలించారు. ప్రమాద వివరాలను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు వారికి వివరించారు.

రత్నగిరిపై అగ్నిప్రమాదం