
ఈటీసీ.. శిక్షణలో మేటి
● మెరుగైన శిక్షణకు చిరునామాగా
విస్తరణ కేంద్రం
● సామర్లకోటలో ఏర్పాటు
● విధులపై ఉద్యోగులకు అవగాహన
సామర్లకోట: ప్రతి ఉద్యోగికి తన విధులపై పూర్తి స్థాయి అవగాహన చాలా అవసరం. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారు. విధి నిర్వహణలో మెరుగ్గా వ్యవహరిస్తారు. దీని కోసమే సామర్లకోటలో విస్తరణ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర 11 జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు శిక్షణ ఇస్తున్నారు. వీరందరూ మండల పరిషత్తు కార్యాలయంలో ఈఓపీఆర్డీ, పరిపాలనాధికారి, జిల్లా పరిషత్తు సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో వారికి పరిపాలనా అనుభవం రావడానికి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి బ్యాచ్‌కు జూలై 28 నుంచి ఆగస్టు 26 వరకు శిక్షణ పూర్తి కాగా, రెండో బ్యాచ్‌ను ఈ నెల 8న ప్రారంభించారు. అక్టోబర్ 10 వరకూ వీరి శిక్షణ కొనసాగుతుంది. ఈ బ్యాచ్‌తో ఎంపీడీఓల శిక్షణ పూర్తవుతుందని ఈటీసీ అధికారులు తెలిపారు.
వివిధ అంశాలపై..
సుమారు 105 ఎకరాల విస్తీర్ణంలో 1952లో వీడీఓల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి చెందిన స్థలాలను బీసీ, ఎస్సీ, హాస్టళ్లతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రానికి కూడా కేటాయించారు. వీడీఓల శిక్షణ కేంద్రం క్రమేపీ విస్తరణ శిక్షణ కేంద్రంగా మారింది. పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకొనే విధంగా ప్రస్తుతం ఎంపీడీఓలకు శిక్షణ ఇస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం 1994, మండల ప్రజాపరిషత్తు పరిపాలన, మండల పరిషత్తు అధికారి విధులు–బాధ్యతలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎంపీడీఓ పాత్ర, మండల పరిషత్తులో మౌలిక వసతుల కల్పన, మండల ప్రజాపరిషత్తు పరిపాలనా వికేంద్రీకరణ, కార్యాచరణ కమిటీల ఏర్పాటు– వాటి సమావేశాలు, మండల పరిషత్తు సమావేశాల నిర్వహణ, మండల విద్యాశాఖాధికారి విధులు–బాధ్యతలు, మండల ఇంజినీరింగ్ అధికారి విధులు–బాధ్యతలు, మండల పరిషత్తు రిజిస్టర్ల నిర్వహణ, బడ్జెట్ తయారీ, గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణ, ఆర్థిక సంఘ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల విధులు–అధికారాలు, గ్రామ సభ నిర్వహణ, స్థానిక ఎన్నికలు, సచివాలయ సిబ్బంది జాబ్ చార్టు, జలజీవన్ మిషన్, గ్రామ పంచాయతీ ఆడిట్–అవగాహన, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.

ఈటీసీ.. శిక్షణలో మేటి