
త్వరలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో త్వరలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలు నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఆమె శనివారం యూనివర్సిటీని సందర్శించిన ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్)అధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్‌తో వివిధ రకాల క్రీడా పోటీలు, నిర్వహణపై చర్చించారు. స్పోర్ట్సు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి బెస్ట్ ఫిజిక్ పోటీల నిర్వహణకు కమిటీలు, తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ పోటీల నిర్వహణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యూత్ ఐకాన్స్‌ను తీసుకువచ్చి, యూనివర్సిటీ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు రూపొందించనున్నామన్నారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి, పద్మ విభూషణ్ గ్రహీత మేరీ కోమ్, ప్రపంచ అథ్లెటిక్స్‌లో బంగారు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళ అథ్లెట్ హిమదాస్ వంటి వారిని త్వరలోనే తీసుకువచ్చి, విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తామన్నారు. యూనివర్సిటీలో విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచే విధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వామి రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగువాడినైన తనకు ఐబీబీఎఫ్ అధ్యక్షుడిగా అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. నన్నయ వర్సిటీలో త్వరలో జరిగే ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలకు ఐబీబీఎఫ్ చేయూతనిస్తుందన్నారు. అనంతరం స్వామి రమేష్ కుమార్‌ను వీసీ ప్రసన్నశ్రీ సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు, పీడీలు పాల్గొన్నారు.
● ‘నన్నయ’లో నిర్వహించేందుకు సన్నాహాలు
● వెల్లడించిన వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ