
ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్
గ్యాస్ సరఫరా నిలిపివేత, తప్పిన ప్రమాదం
తాళ్లరేవు: స్థానిక గమిని ఐస్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ పైపులైన్ లీకై న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఫ్యాక్టరీ సిబ్బంది తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న భూగర్భజల శాఖ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ ప్రసన్న, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెంకటేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ రామచంద్రమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ టి.సూరిబాబు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది ఫ్యాక్టరీని బుధవారం సందర్శించి పరిస్థితిని క్షణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని తెలిపారు. అనుమతులు తీసుకునేవరకు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా నడుపుతున్న ఐస్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాలేదని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.