
కౌలుకోలేక..
ఫ దూసుకుపోతున్న
పొగాకు ధరలు
ఫ వచ్చే ఏడాది లీజులపై
పడనున్న పెరుగుదల
ఫ ఎకరాకు కౌలు రూ.80 వేలు
ఫ బ్యారన్ల లీజుకు రెక్కలు
ఫ లబోదిబో మంటున్న కౌలు రైతులు
దేవరపల్లి: పొగాకు ధరలు రోజురోజుకూ అంచనాలకు అందని రీతిలో పెరుగుతున్నాయి. రైతులు మునుపెన్నడూ ఊహించని విధంగా కిలోకు గరిష్టంగా రూ.430కి లభిస్తోంది. ఈ ధర ఇటు రైతులు.. అటు కౌలు రైతులకు కాసులు కురిపిస్తోంది. ఈ పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ఈ ప్రభావం 2025–26 ఏడాది సాగుపై పడనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకుకు డిమాండ్ పెరగడంతో భూ యజమానులు వారి భూముల కౌలు, బ్యారన్ల లీజులు, బ్యారన్ల లైసెన్సు ధరలను అమాంతం పెంచేశారు. దీంతో రానున్న ఏడాదికి సాగుచేసే కౌలు రైతులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే భూముల కౌలు స్వల్పంగా పెరిగినప్పటికీ బ్యారన్ల లీజు, లైసెన్సు ధర పెరగడమే ఇందుకు కారణం. పొగాకు సాగు చేసే రైతుల్లో 80 శాతం కౌలుదారులే ఉన్నారు. కౌలు భూములు, లీజు బ్యారన్లు ఇప్పటి నుంచే కౌలు రైతులు హడావుడి పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు భూములను కౌలుకు, బ్యారన్లను లీజుకు తీసుకుని సిద్ధమవుతున్నారు. జీడిమామిడి, మామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటలను తొలగించి పొగాకు సాగు చేయడానికి భూములను సిద్ధం చేస్తున్నారు. ఎకరం కొబ్బరితోటపై ఆదాయం రూ.30 వేలు, జీడిమామిడి తోటపై రూ.20 వేలు, ఆయిల్‌పామ్ పంటపై రూ.50 వేలకు మించి ఆదాయం రావడం లేదని, భూములను కౌలుకు ఇస్తే శ్రమ లేకుండా ఎకరాకు రూ.70 నుంచి 80 వేలు వస్తోందని రైతులు అంటున్నారు. పెద్ద రైతులంతా పొగాకు వ్యవసాయానికి స్వస్తి చెప్పి బ్యారన్లను లీజుకు ఇచ్చి భూముల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు.
గణనీయంగా పెరగనున్న సాగు
2025–26 సంవత్సరానికి జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 2024–25 పంట సీజన్‌లో రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో సుమారు 29 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 2023–24 ఏడాదిలో తూర్పు, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 27 వేల హెక్టార్లలో పంట సాగు చేసినట్టు అధికారులు తెలిపారు. బోర్డు అనుమతించిన దానికంటే అదనంగా సుమారు 20 నుంచి 25 వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2023–24 సీజన్‌లో 58.25 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 80 మిలియన్ కిలోలు పండించారు. 2024–25 సీజన్‌లో 49 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా 67 మిలియన్ కిలోలు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఎన్ని నిబంధనలు విధించినా వచ్చే ఏడాది 100 మిలియన్ల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
బ్యారన్ లైసెన్స్ ధర రూ.10.50 లక్షలు
మార్కెట్లో పొగాకు ధర అనూహ్యంగా పెరగడంతో బ్యారన్ లైసెన్సు ధర రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. 2022లో బ్యారన్ లైసెన్సు ధర రూ.2.60 లక్షలు, 2023లో రూ.4 లక్షలు ఉండగా, 2024–25లో రూ.10.50 లక్షలు, ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతోంది. గతంలో బ్యారన్లు అమ్ముకున్న రైతులు ప్రస్తుత ధరను చూసి లబోదిబో మంటున్నారు. గత ఏడాది బ్యారన్ లీజు రూ.60 నుంచి 70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.1.70 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.2.10 లక్షలు పలుకుతుందని రైతులు తెలిపారు. గత రెండేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు ప్రస్తుతం అద్దె పలుకుతుందని రైతులు తెలిపారు.
రెట్టింపు పలుకుతున్న కౌలు
సాగు భూమి కౌలు ధర రెట్టింపు పలుకుతుంది. గత ఏడాది ప్రాంతాన్ని బట్టి కౌలు ధర పలుకుతుంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల్లో ఎకరం కౌలు రూ.80 వేలు పలుకుతుండగా, దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెం, యర్నగూడెం గ్రామాల్లో రూ.75 వేలు, దేవరపల్లిలో రూ.70 వేలు కౌలు ధర పలుకుతుందని రైతులు తెలిపారు. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో నల్లరేగడి భూముల కౌలు రూ.70 వేలు పలుకుతున్నట్టు రైతులు తెలిపారు. 2022లో ఎకరా కౌలు రూ.25 వేల నుంచి 30 వేలు ఉండగా, 2023–24లో రూ.35 వేల నుంచి 42 వేలు పలికింది. 2024–25లో రూ.60 నుంచి 70 వేలు పలికిన కౌలు ప్రస్తుతం రూ.70 నుంచి 80 వేలు పలుకుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు.

కౌలుకోలేక..