
అంతర్ జిల్లాల మోటార్‌సైకిల్ దొంగల అరెస్ట్
26 వాహనాల స్వాధీనం
పెరవలి: ఇళ్ల వద్ద ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలించడంలో ఆరితేరిన అంతర్ జిల్లాల నేరస్తులను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. తూర్పు, పశ్చిమ, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాల్లో దొంగిలించిన 26 మోటార్ సైకిళ్లను దొంగల నుంచి పోలీసులు రికవరీ చేసి వారిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ పెరవలి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లాల్లో 26 మోటార్ సైకిళ్లను దొంగిలించారని వీటి విలువ రూ.40 లక్షలని తెలిపారు. ఈ దొంగతనాలకు పాల్పడిన యువకులు పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మగంటి ధనుష్, నెక్కంటి యువరాజు, వనచర్ల రాజు, కూనపురెడ్డి వీరబాబు ఉండగా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్, అబ్బిరెడ్డి పాపారావు ఉన్నారన్నారు. ఈ దొంగతనాల్లో ప్రధాన నిందితులు తుమ్మగంటి ధనుష్, విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్‌లని తెలిపారు. ప్రస్తుతం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నామని విశ్వనాధుల దేవిశ్రీప్రసాద్ పరారీలో ఉన్నాడని ఇతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్‌లు తిరుగుతున్నారని చెప్పారు. మోటార్ సైకిళ్ల చోరీ కేసులో పెరవలి, కొవ్వూరు, నిడదవోలు పోలీసులు ఎంతో చాకచక్యంగా నేరస్తులను పట్టుకుని వారి నుంచి 26 మోటార్‌సైకిళ్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకున్న పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, ట్రైనీ ఎస్సై కె.సౌజన్యను అభినందించారు. ఈ కేసును త్వరితగతని చేధించడానికి కారణమైన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐ పీవీజీ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు.
సర్పవరంలో ఒకరి అరెస్టు..
కాకినాడ రూరల్: సర్పవరం పోలీసులకు మోటారు సైకిళ్ల దొంగ పట్టుబడ్డాడు. 20 ఏళ్ల వయసులోనే చాకచక్యంగా బైక్‌ల చోరీల్లో ఆరితేరాడు. సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన పెంకే తేజను సోమవారం నిందితుడిని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్సై శ్రీనివాస్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. నిందితుడి నుంచి రూ.6.5 లక్షల విలువైన 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన క్రైమ్ సిబ్బంది హెచ్‌సీలు సత్తిబా బు, రాజు, గణేష్, పీసీలు రవి, శ్రీనివాస్, అనిల్, చిన్నబాబు, కిశోర్‌లను సీఐ పెద్దిరాజు అభినందించారు.

అంతర్ జిల్లాల మోటార్‌సైకిల్ దొంగల అరెస్ట్