
ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికుడి దాడి
గోకవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగడంతో చేతి వేలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల ప్రకారం గోకవరం డిపోకు చెందిన సింగిల్ స్టాప్ రాజమహేంద్రరంలోని గోకవరం బస్టాండ్ నుంచి 67 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో గోకవరం బయలుదేరింది. గోకవరానికి చెందిన ఓ ప్రయాణికుడు రూ.105 ఇచ్చి టికెట్ కొనుగోలు చేయగా కండక్టర్ గరగా పాండురంగ టికెట్ ఇచ్చి మిగిలిన చిల్లర రూ.60 తిరిగి ఇచ్చాడు. ఈ క్రమంలో రూ.50 నోటు బాగా లేదని సదరు ప్రయాణికుడు కండక్టర్‌పై దాడికి దిగడంతో కండక్టర్ వేలికి తీవ్ర గాయమైంది. దీంతో డ్రైవర్ బస్సుని గోకవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఆపి ప్రయాణికుడు రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. అనంతరం కండక్టర్‌ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయగా చేతి వేలు విరిగిపోయిందని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ సంఘటనతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని కండక్టర్‌ని గాయపరిచిన ప్రయాణికుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్‌ని సంప్రదించగా సిబ్బందిపై దాడి ఘటన దురదృష్టకరమన్నారు.