ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు జట్టు కార్మికులు
పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో మొండెపులంక గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జట్టు కార్మికులతో వెళ్తున్న గూడ్స్ వ్యాన్ అదుపుతప్పి పంట కాలువలో పడిపోయింది. ప్రమాదం నుంచి వ్యాన్‌లో ఉన్న ఐదుగురు జట్టు కార్మికులు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన జట్టు కార్మికులు మంగళవారం జగ్గన్నపేటలో ఇంటికి శ్లాబు వేశారు. శ్లాబు పనులు ముగిసిన అనంతరం సంబంధిత సామాన్లు, మిల్లర్‌తో సహా వ్యాన్‌లో పలివెల గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ మొండెపులంక వద్ద కుడివైపున ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వ్యాన్‌లో ఉన్న వారిని బయటకు తీసారు. వ్యాన్‌లో ఉన్న వైబ్రేటర్లు, ఇతర సామాన్లు నీట మునిగాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులకు స్థానికులు సహాయం అందించారు. రోడ్డుకు ఎడమవైపు ఉన్న ప్రధాన పంట కాలువలోకి వ్యాన్ పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు వివరించారు.