
సృజనాత్మకత వెలికితీసేందుకే వారధి పోటీలు
అమలాపురం టౌన్: విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు, సృజనాత్మకత వెలికి తీసేందుకే వారికి వారధి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. అమలాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వారధి పోటీలను బాషా మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు డీఈవో బాషా, జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.మమ్మీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమగ్ర శిక్షా కో ఆర్డినేటర్ మమ్మీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ఇలాంటి పోటీల వల్ల బయటకు వస్తాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆర్.వెంకటేశ్వరరావు, ఏవీఎల్ నరసింహారావు, పీవీఎల్‌ఎన్ శ్రీరామ్, కాలే దుర్గాభవాని, ఉదయ శంకర్, సీహెచ్‌ఎల్‌జీ నరసింహారావు, జి.సీతారామలక్ష్మి, ఎస్.బాబు వ్యవహరించారు.
ప్రలోభాలకు లొంగలేదన్న
కక్షతోనే ఆరోపణలు
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ నుంచి కౌన్సిలర్‌గా నెగ్గిన మీ తల్లిని మున్సిపల్ చైర్‌పర్సన్ చేయడం కోసం మా పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు మా పార్టీ కౌన్సిలర్లు, నాయకులు అవినీతిపరులని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. స్థానిక వాసర్ల గార్డెన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్లు తిక్కిరెడ్డి వెంకటేష్, రుద్రరాజు నానిరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు మాట్లాడారు. మంత్రి సుభాష్ పార్టీ కౌన్సిలర్లను రూ.లక్షల్లో బేరం ఆడడమే కాకుండా విల్లాలు ఇస్తానని ప్రలోభపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ ీసీపీ కౌన్సిలర్లు ఈ ప్రలోభాలకు లొంగలేదన్న కక్షతో నేడు పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. అమలాపురం జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన రూ.కోటి అవినీతిలో తనకు సంబంధం ఉందని, విచారణ చేయిస్తానని మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని పట్టణ పార్టీ అధ్యక్షుడు బులినాని అన్నారు. ఇందులో తనకు, తన కుటుంబానికి సంబంధం ఉందని మంత్రి రుజువు చేస్తే నీ చెప్పు నా మెడలో వేసుకుంటాను, రుజువు చేయకపోతే నా చెప్పు నీ మెడలో వేసుకోవాలని బులినాని మంత్రి సుభాష్‌కు సవాల్ విసిరారు. మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, చిత్రపు రామకృష్ణ, పార్టీ నాయకులు కుడుపూడి భరత్‌భూషణ్, కట్టోజు రాము, విత్తనాల మూర్తి, దొంగ చిన్నా, వాసర్ల సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణతో వంద మందిలో నలుగురికే లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నారని, అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులను ఎస్సీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు.

సృజనాత్మకత వెలికితీసేందుకే వారధి పోటీలు

సృజనాత్మకత వెలికితీసేందుకే వారధి పోటీలు