
ఆదిత్యలో అట్టహాసంగా వేద–2కే25
గండేపల్లి: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఉత్తమ సాధన, నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరమని కాకినాడ జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ విద్యార్థులనుద్దేశించి అన్నారు. మండలంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సోమవారం ఇంజినీరింగ్ డే సందర్భంగా వేద–2కే25 పేరిట జాతీయస్థాయి సాంకేతిక సింపోజియంకు మొదటిరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భవిష్యత్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య ప్రో చాన్సలర్ ఎన్.సతీష్‌రెడ్డి మాట్లాడుతు జాతీయస్థాయిలో సాంకేతిక ప్రతిభ, ఆవిష్కరణలు పెంపొందించే వేదికగా వేద రూపుదిద్దుకుంటుందున్నారు. ఈ ఏడాది 14,340 మంది విద్యార్థులు సాంకేతిక పోటీలకు, ఈవెంట్లలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రో ఎంబీ శ్రీనివాస్, ప్రో వైస్ చాన్సలర్ ఎస్.రమాశ్రీ, ఆదిరెడ్డి రమేష్, రవి తంగజన్, వేద కన్వీనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.