
పొంతన లేని సమాధానాలు మానుకో..
ఫ కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం
ఫ మంత్రి సుభాష్‌పై వైఎస్సార్ సీపీ శెట్టిబలిజ నేతల ధ్వజం
అమలాపురం టౌన్: శెట్టిబలిజిలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అన్యాయం గురించి అడిగితే మంత్రి వాసంశెట్టి సుభాష్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీకి చెందిన జిల్లా శెట్టిబలిజ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ శెట్టిబలిజ నేతలు అమలాపురంలోని వాసర్ల గార్డెన్‌లో ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి సుభాష్ అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొక్కా వెంకటలక్ష్మి, కోనసీమ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరాసాహెబ్ శెట్టి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని బులినాని, కొత్తపేట జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, శెట్టిబలిజ యువజన అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాసరావు తదితరులు మంత్రి సుభాష్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. శెట్టిబలిజలకు ఈ ప్రభుత్వం సుమోటోగా గౌడ (శెట్టిబలిజ) అని కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న అన్యాయంపై కలెక్టర్‌కు పార్టీ సామాజిక వర్గం తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ద్వారా వినతి పత్రాలు అందించామన్నారు. అందుకు మంత్రి సుభాష్ మొదట సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని, మరోసారి ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని పొంతన లేని మాటలు చెప్పారని గుర్తు చేశారు. అంతే కాకుండా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై, జగ్గిరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంత్రి సుభాష్‌కు రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందన్నారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే గౌడ (శెట్టిబలిజ) అని కుల ధ్రువీకరణ పత్రం జారీకి జీఓ ఇచ్చారని అన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లేని ఈ సమస్య ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నించారు. అంటే చంద్రబాబుతో పాటు సుభాష్ ఎక్కడున్నా కులాల కుంపటి రాజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కులాలను విడదీయడం, వారు తన్నుకుంటుంటే చూసి ఆనందిండచం పైశాచికత్వంగా మారిందని విమర్శించారు. మంత్రి వర్గంలో 25 మంత్రులుంటే ముఖ్యమంత్రి వారికి రా్యాంకులు ఇచ్చినప్పుడు సుభాష్‌కు 25వ ర్యాంక్ ఇవ్వడంతోనే సుభాష్ మంత్రి పదవిని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలిసిందని అన్నారు. శెట్టిబలిజల పరువు తీసేలా సుభాష్ ప్రవర్తించడం బాధాకరంగా ఉందన్నారు. అసలు శెట్టిబలిజల సామాజిక వర్గం కోటా వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై తమ పార్టీ అధినేత జగన్ గురించి, తమ పార్టీ నేతల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
రూ. కోటి జమ ఏమైంది..?
శెట్టిబలిజల వన సమారాధన వేదికపై తాను శెట్టిబలిజ యూత్ ఫోర్స్ తరఫున రూ.కోటి జమ చేసి ఆ నిధులను తమ సామాజికవర్గ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఉపాధి మార్గాలు చూపిస్తానని గతంలో మంత్రి సుభాష్ చెప్పిన మాటలను పట్టణ పార్టీ అధ్యక్షుడు బులినాని గుర్తు చేశారు. ఇంత వరకూ రూ.కోటి జమ చేయలేదని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీకి చెందిన శెట్టిబలిజ నేతలు విత్తనాల శేఖర్, కముజు రమణ, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కుడుపూడి భరత్ భూషణ్, విత్తనాల మూర్తి, కాండ్రేగుల గోపి, వాసర్ల సుబ్బారావు, దొంగ చిన్నా తదితరులు పాల్గొన్నారు.