
జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా బాధ్యతల స్వీకరణ
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీగా రాహుల్ మీనా ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు జిల్లా అదనపు ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగానే ఆయనను అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్‌తో పాటు జిల్లా ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలసి పరిచయం చేసుకున్నారు. స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాసరావు, సోషల్ మీడియా సీఐ జి.వెంకటేశ్వరరావు, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, రూరల్ సీఐ డి.ప్రశాంత్‌కుమార్ తదితరులు నూతన ఎస్పీని కలిశారు.
నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.50 వేల సమర్పణ
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం రాజమహేంద్రవరానికి చెందిన దాత అఖండం వెంకట రమణ మూర్తి, కుటుంబ సభ్యులు రూ.50 వేల విరాళం సమర్పించారు. పైమొత్తాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌కు ఇచ్చారు. దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాలు, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
17 నుంచి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
అమలాపురం రూరల్: ప్రధాని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న నరేంద్ర మోదీ స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రారంభించి అక్టోబర్ 2 వరకూ నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, గ్రామ హెల్త్ సెంటర్లలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తామన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ మహా కార్యక్రమాలు పాటిస్తామన్నారు.
తలుపులమ్మతల్లి ఆదాయం రూ.6.14 లక్షలు
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మతల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో లోవ జనసంద్రమైంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు లోవ దేవస్థానానికి చేరుకున్నారు. క్యూలైన్లు ద్వారా 16 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు.
లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,11,095, పూజా టికెట్లకు రూ.2,35,580, కేశఖండనశాలకు రూ.16,160, వాహన పూజలకు రూ.8180, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.95,792, విరాళాలు రూ.46,440 వెరసి మొత్తం రూ.6,14,247 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు.

జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా బాధ్యతల స్వీకరణ