
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
రూ.2 లక్షల ఆస్తి నష్టం
అయినవిల్లి: మండలంలోని నేదునూరు గౌతమీనగర్‌లో శుక్రవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించి ఓ పూరిల్లు కాలి బూడిదైంది. దీనికి సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నేదునూరు గౌతమినగర్‌కు చెందిన ఇసుకపట్ల నాగ వెంకట రమణకు చెందిన పూరిల్లు శుక్రవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా కాలి బూడిదైంది.
ఈ ప్రమాదంలో ఇంటిలోని పర్నిచర్, బీరువా, దుస్తులు, పిల్లలకు పుస్తకాలు మొదలైనవి కాలి బూడిదైయ్యాయి. సుమారుగా రూ.2లక్షల ఆస్థినష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆదుపు చేశారు. అమలాపురం అగ్రిమాపక అధికారి రాజా, స్థానిక తహశీల్దార్ సీహెచ్ విద్యాపతి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితలకు తహశీల్దార్ విద్యాపతి ప్రభుత్వం నుంచి ముందస్తు సాయంగా 25 కిలోల బియ్యం అందజేశారు. వీరి వెంట స్థానిక సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు ఇండుగుల వెంకట్రామయ్య, కళ్లేపల్లి సుబ్బరాజు, ఆర్‌ఐ రాయుడు తదితరులు ఉన్నారు.