
రసాయన రహిత ఉత్పత్తులు అందించాలి
అమలాపురం రూరల్: వినియోగ దారులకు రసాయన రహిత ఆహార ఉత్పత్తులను అందించాలని రైతులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్ అమలులో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో సేంద్రియ వ్యవసాయం పద్ధతులపై వ్యవసాయ అనుబంధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారా మానవుని సగటు జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ రూపొందించబడిందన్నారు. డీఆర్డీఏ అధికారులు మరింత మంది డ్వాక్రా సంఘాలకు ప్రకృతి సేంద్రియ కషాయాల తయారీలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. దీనిలో భాగంగా ఈ నెల 20 నాటికి మండలాల వారీగా ప్రకృతి సేద్య విధానాల అమలుపై కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి సమర్పించాలన్నారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం శ్రీనివాసు, అదనపు డీపీఎం సత్యనారాయణలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ 15 వరకు గాలికుంటు టీకాలు
పశువులకు గాలికుంటు నివారణ టీకాలను ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ అందించాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలిసి ఆ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో టీకాలు వేస్తూ పశు వ్యాధులను నియంత్రించాలన్నారు. పశుసంపదను పెంచడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణకు పశు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. నాలుగు నెలల వయసు దాటిన పశువులకు తప్పని సరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని అధికారులకు ఆదేశించారు.