
భావి పౌరుల రూపశిల్పులకు గౌరవం
సఖినేటిపల్లి: సమాజంలో భావి పౌరులను తీర్చిదిద్దడంలో విశేషకృషి చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో గౌరవం దక్కింది. హెచ్‌ఎం చిట్నీడి నిరంజని, ఉపాధ్యాయులు గుండేపల్లి ప్రభావతి, ఆలేటి దుర్గాప్రసాద్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకోనున్నారు. సఖినేటిపల్లిలంక గంటి మోహన్ చంద్ర బాలయోగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, తెలుగు టీచర్ గుండేపల్లి ప్రభావతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యాపరంగా, భాషా పరంగా, సామాజిక పరంగా సేవలు అందిస్తున్న ఆమెకు అవార్డు దక్కింది. 2001లో డీఎస్సీ ద్వారా ఎంపికై , రావులపాలెం మండలం ఈతకోట, అంతర్వేదిపాలెం మధ్యగ్రూపు పాఠశాలల్లో పనిచేశారు. 2021 నుంచి సఖినేటిపల్లి లంక జెడ్పీ హైస్కూల్‌లో కొనసాగుతున్నారు. ఏపీ ఎన్‌జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఏడో తరగతి పాఠ్య పుస్తక రచయిత్రిగా కోనసీమ జిల్లాకు చెందిన చావలి బంగారమ్మను సాహిత్య పరంగా, అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మను సేవాపరంగా ఆమె పరిచయం చేశారు.
పాఠశాల అభివృద్ధిలో నిరంజని కృషి
రాజోలు: రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ములికిపల్లికి చెందిన చిట్నీడి నిరంజని ఎంపికయ్యారు. ప్రస్తుతం కాట్రేనిపాడు ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా మామిడికుదురు హైస్కూల్ హెచ్‌ఎంగా ఉన్నప్పుడు సుమారు రూ.మూడు కోట్లతో పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు, మామిడికుదురు ఉన్నత పాఠశాలకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. తొలిసారిగా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఆలేటి సేవలకు గుర్తింపు
కొత్తపేట: మండలంలోని ఆవిడి ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు ఆలేటి దుర్గాప్రసాద్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్ ట్రిపుల్ ఎంఏ, ఎంఈడీ చదివారు. 1986 ఆగస్టు 4న కొత్తపేట పంచాయతీ పరిధిలోని గోగువారి పేట ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు. మండలంలోని పలు పాఠశాలల్లో పనిచేసి, ప్రస్తుతం ఆవిడి పాఠశాలలో సేవలందిస్తున్నారు.
ముగ్గురికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

భావి పౌరుల రూపశిల్పులకు గౌరవం

భావి పౌరుల రూపశిల్పులకు గౌరవం