
కోనసీమ మౌలిక అభివృద్ధికి సహకరించాలి
అమలాపురం రూరల్: మౌలిక వసతులు కల్పనకు చమురు సహజ వాయువుల కంపెనీలు ముందుకు రాని పక్షంలో ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నా మని కోనసీమ ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ఇటీవల చమురు సంస్థలు స్థానిక కార్యకలాపాలతో లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కోనసీమ అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు వేయలేదని కోనసీమ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులు, వంతెన నిర్మాణాలపై స్పందించకపోతే అక్టోబర్ నెలాఖరు నుంచి వంతెనలపై భారీ వాహనాల రాకపోకలను అడ్డుకుంటామని అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యనారాయణ, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో కోనసీమలోని చమురు సంస్థల ప్రతినిధులతో వారు సమావేశం నిర్వహించారు. రెండేళ్లుగా కేటాయించిన సీఎస్సార్ నిధులపై చర్చించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, కోనసీమలో చమురు సంస్థల భారీ వాహనాలతో రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. అక్టోబర్ తొలివారంలో కంపెనీల ఈడీలు చర్చలకు రావాలని స్పష్టం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, చమురు, సహజ వాయువులను తరలించుకోవడం మినహా, అభివృద్ధికి కనీస నిధులు కేటాయించడం లేదన్నారు. చమురు సంస్థల ప్రతినిధులు సునీల్‌కుమార్, మజుందార్, ప్రభాకర్, రావు, సుమన్‌దేవ్, మురళీకృష్ణ పాల్గొన్నారు.
చమురు సంస్థలకు ప్రజాప్రతినిధుల ఆదేశం