
గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ స్వదేశానికి రాక
అమలాపురం రూరల్: జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి.. అక్కడ చిక్కుకుని చిత్రవధలు అనుభవిస్తున్న మహిళ.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ చొరవతో స్వదేశానికి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం వీధివారలంకకు చెందిన వివాహిత చీకురుమల్లి మంగాదేవి స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో కుటుంబ పోషణ కోసం మూడు నెలల క్రితం అప్పు చేసి ఏజెంట్ ద్వారా గల్ఫ్‌కు వెళ్లింది. మూడు నెలలైనా ఆమెను ఎక్కడా పనిలో పెట్టలేదు. ఓ ఆఫీసులో ఉంచి ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. సరైన భోజనం పెట్టకుండా, శారీరకంగా హింసించారు. దీంతో తాను స్వదేశానికి వెళ్లిపోతానని చెప్పడంతో, రూ.1.50 లక్షలు కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పటికే అప్పులు చేయడం, కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఆ సొమ్ము చెల్లించలేకపోయింది. ఇదే విషయాన్ని ఇటీవల అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన తండ్రి నెల్లి రామారావుకు ఫోన్‌లో చెప్పింది. ఇక్కడే ఇలా ఉంటే స్వదేశానికి ప్రాణాలతో రాలేనేమోనని ఆవేదన వెళ్లగక్కింది. కష్టాల్లో ఉన్న కుమార్తెను ఎలాగైనా కాపాడుకోవాలని అతడు తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించారు. తమ గోడును కేంద్ర ప్రతినిధులకు వివరించారు. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను స్వదేశానికి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఏజెంట్, అక్కడి ఆఫీస్, భారత రాయబార కార్యాలయం వారితో సంప్రదించారు. ఎట్టకేలకు మంగాదేవిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్రం నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయకర్త జి.రమేష్ మంగళవారం తెలిపారు.