
విలక్షణానికి ప్రతీకలు మువ్వురు తల్లులు
● శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ
● సదనంలో సరస్వతీ సపర్యా మహోత్సవాలు
సీటీఆర్‌ఐ: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు మూడు రకాల స్వభావాలకు ప్రతీకలుగా నిలుస్తారని శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అన్నారు. ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో జరుగుతున్న సరస్వతీ సపర్యా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు అయిన కౌసల్య, సుమిత్ర, కై కేయిలపై ప్రసంగించారు. వారి విలక్షణ స్వభావాలను వివరిస్తూ విశ్వనాథ అనేక విశేషణాలను వాడారని అన్నారు. కై కకు రాముడిపై అపరిమిత వాత్సల్యం ఉండేదని, రాముడికి బాల్యంలో విలువిద్య నేర్పింది కై కయేనన్నారు. తదనంతర కాలంలో రాముడి వనవాసాన్ని కోరిన కారణంగా పైకి మంథర దుర్బోధగా కనపడినా, అసలు కారణం దైవ ప్రేరణగా భావించాలని వివరించారు. నన్ను సవతి తల్లిని చేశావు.. అని రామునితో కైక అన్న మాటల్లో ఆమె క్రోధం కన్నా, బాధ ఎక్కువగా ధ్వనిస్తుందని విశదీకరించారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వలక్ష్య సంగ్రహం, వ్యాకరణ, ఛంద ప్రయోగాల్లో ఆయన వివిధ రకాల ప్రయోగాలను చేశారన్నారు. నా భక్తి రచనలు నావిగాన.. అని చెప్పుకొన్న ధీశాలి విశ్వనాథ అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.అన్నపూర్ణ మాట్లాడుతూ, ప్రాచీన కవుల మూల గ్రంథాలను అనువదించేటప్పుడు తర్వాత తరం కవులు స్వతంత్ర ధోరణులు అవలంబించడం, మూలంలోని అంశాలను విస్తరించడం, పరిహరించడం పరిపాటి అన్నారు. కళాశాల అధ్యాపకులు సత్యశిరీష, శ్రీదేవి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ బులుసు అపర్ణను ఘనంగా సత్కరించారు. సోమవారం అవధాన శేఖర రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రబంధ కవుల సరస్వతీసపర్య అనే అంశంపై ప్రసంగిస్తారు.