
మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఐ.పోలవరం: గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యానాం – ఎదుర్లంక వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు యానాం గోపాల్‌నగర్‌కు చెందిన దుర్గ ఆదివారం ప్రయత్నించింది. అటుగా వెళ్తున్న ఎస్‌బీ కానిస్టేబుల్ నాగరాజు గమనించి ఆమెను నలుగురి సాయంతో రక్షించారు. వివరాలు అడిగి తెలుసుకుని.. భర్త, పిల్లలకు సమాచారం అందజేశారు.
కాగా, దుర్గ యానాంలో ఇంటి పనులు చేస్తుండగా, భర్త ఆటోను నడుపుతున్నట్టు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదమే కారణమని తెలుసుకుని ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన నాగరాజును స్థానికులతో పాటు, పోలీసులు అభినందించారు.