
కాయకల్ప తరువు
● ఆరోగ్య ప్రదాయిని.. కొబ్బరి
● నీటి నుంచి ఆయిల్ వరకు ప్రతిదీ ఔషధమే..
● నీరు, ముక్క, పాలు ఇలా ఎన్నెన్నో!
● అన్నింటా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో
1.30 లక్షల ఎకరాల్లో సాగు
● నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి ఒక్క ఉమ్మడి తూర్పులోనే 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే కొబ్బరి ఔషధాల గని. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉపాధి పొందుతుంటే.. ఆయా ఉత్పత్తుల ద్వారా సామాన్యులు సైతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఔషధాలను అందిస్తూ కొబ్బరి ఆరోగ్య వర ప్రదాయినిగా పేరొందింది. సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
కొబ్బరి చెట్టును చూస్తే గోదారమ్మ ఒడిలో ఒదిగిన అందాల బిడ్డలా కనిపిస్తుంది. ప్రకృతి అందాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అదనపు అందాలు అద్దే కొబ్బరి చెట్టు చూసి ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తోటల్లో పంటగానే కాదు వరిచేను.. చెరువులు.. రోడ్లు.. కాలువలు.. నదీపాయల వెంబడి.. ఇళ్ల చుట్టూ కనిపించే కొబ్బరి చెట్టు గోదావరి వాసుల నుదుటిన ప్రగతి తిలకం దిద్దుతూ ఇక్కడ వారి జీవనంలో పెనవేసుకుపోయింది. కన్న కొడుకుగా పిలుచుకుంటారంటే.. వారి జీవనంలో కొబ్బరికి ఎంత ప్రాముఖ్యమో అవగతమవుతుంది.
మధుమేహ రోగులకు కొబ్బరి కల్పరస
కొబ్బరి జ్యూస్ (కల్లు–కల్పరసా) ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఫెర్మంటేషన్ ఆవకుండా ఉత్పత్తి చేసే కొబ్బరి జ్యూస్ (నీరా) నేరుగా తాగినా, దీనిని నుంచి ఉత్పత్తి చేసే పంచదార, బెల్లం, తేనెను ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో గైసమిక్ ఇండెక్స్ 25 శాతం మాత్రమే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.