
పాడైన పంటల పరిశీలన
పెరవలి: గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి చనిపోయిన విషయమై సాక్షిలో జల దిగ్బంధం శీర్షికన సోమవారం వెలువడిన కథనానికి ఉద్యానవన అధికారులు స్పందించారు. వివిధ ప్రాంతాల్లో పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ, దిగువ లంకల్లో పంటలు పూర్తి పాడైపోయాయని, నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే వరద పూర్తిగా తగ్గాలన్నారు. ఆ తర్వాత పంటలు పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు మరో వారం ఆగాల్సి ఉంటుందన్నారు. సోమవారం కానూరు నుంచి కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం వరకు పంటలను పరిశీలించామన్నారు. వరద తగ్గాక అంచనాలు తయారు చేయాలని వీఆర్వోలు, ఉద్యానవన అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల రైతులతోనూ మాట్లాడినట్టు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కొయ్యలగూడెం: అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కన్నాపురం గ్రామ శివారున సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపూడి సత్యనారాయణ (60) ద్విచక్ర వాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కన్నాపురం శివారున వాహనంతో చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

పాడైన పంటల పరిశీలన