
వేదాలతో లోకం సుభిక్షం
అమలాపురం రూరల్: ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ వేదాలకు పుట్టినిల్లు కోనసీమ అని అన్నారు. ఇందుపల్లిలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ ఆధ్యర్యంలో ఏటా వార్షిక వేదశాస్త్ర మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, వడ్లమని సుబ్రహ్మణ్య ఘనపాఠి, దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు తదితరులు వేదాల గొప్పదనం గురించి వివరించారు. బాలభక్త గణపతి సేవా సంఘ అధ్యక్షుడు తాతకాశీ విశ్వనాథ్ స్వాగత ఉపన్యాసం చేశారు. వేద పండితులను పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ర సోమసుందరం (దత్తు), ముష్టి వెంకట రాజేశ్వరశర్మ సత్కరించారు.