
దేవాలయ భూముల్లో చెట్ల నరికివేత!
కొత్తపల్లి: మండలంలోని గోర్స గ్రామానికి చెందిన పురాతన సీతారామస్వామి దేవాలయ భూముల గట్లపై ఉన్న చెట్ల నరికివేత చర్యలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ భూముల్లో ఎటువంటి వ్యవసాయ పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం, కొమరగిరి గ్రామంలో సర్వే నంబరు 121, 122లో గోర్స దేవాలయానికి సుమారు 20 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆక్రమణదారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. ఇలాఉంటే ఆక్రమణదారులు ఇందులో వ్యవసాయ పనులు చేపట్టేందు కు ఆదివారం సిద్ధమయ్యారు. గట్టుపై చెట్లను నరికించడంతో.. సర్పంచ్ రొంగల వీరబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకుని, తహసీల్దార్ చిన్నారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్వో కిషోర్ ఆక్రమణదారులు, చెట్లను నరికిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై వెంకటేష్ తెలిపారు.