అమలాపురం టౌన్: రాజ్యాంగ పరిరక్షణకు ఓటే జీవ నాడి అని, దొంగ ఓట్లతో గెలిచే విధానం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ అన్నారు. అమలాపురంలోని అరిగెలపాలెంలో ఆర్‌పీఐ ముఖ్య నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. డీబీ లోక్ మాట్లాడుతూ ప్రస్తుతం లోప భూయిషమైన ఎన్నికల విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ధామషా పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో పలు పార్టీలు తమ అభ్యర్థులను అడ్డదారుల్లో నెగ్గించుకుంటున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ఓటింగ్ విధానం మనకు ఉందని, దాని ద్వారానే రాజ్యాంగాన్ని రచించుకుని, ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నామన్నారు. ఆ పార్టీ నాయకుడు ఉండ్రు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు డి.నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, పండు రాజేష్, డి.రాంజీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి
అమలాపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అమలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు ఎండీ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళంలో జరిగిన ఎన్నికల్లో తనను ఎన్నుకున్నారన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి తగ్గించాలని, ప్రశాంత వాతావరణంలో బోధన చేసేలా అవకాశం కల్పించాలన్నారు.
స్థల వివాదంపై 22న ట్రావెర్స్ సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న స్థలంపై దేవస్థానం, ఇరిగేషన్ శాఖల మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు ఈ నెల 22న ‘ట్రావెర్స్’ సర్వే నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవస్థానం, ఇరిగేషన్, రెవెన్యూ, లాండ్ సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ స్థలం దేవస్థానానికి చెందుతుందా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు సర్వే చేశారు. మొదటిసారి సర్వే మధ్యలో నిలిచిపోయింది.
రెండోసారి నిర్వహించిన సర్వేలో స్థలం దేవస్థానానిదే అని తేలినా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కలెక్టర్ మూడోసారి జాయింట్ సర్వేకు ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీన పెద్దాపురం ఆర్డీఓ రమణి పర్యవేక్షణలో దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేశారు. ఆ సర్వేపై కూడా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్రావెర్స్ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. ట్రావెర్స్ సర్వేలో వివాద స్థలం ముందు వెనుక గల స్థలాలను కూడా కలిపి సర్వే చేస్తారు. సర్వే అధికారుల టీం ఎక్కడికక్కడ సర్వే రాళ్లు పాతి దీనిని నిర్వహిస్తారని రెవెన్యూ అఽధికారులు తెలిపారు. రత్నగిరి కొండ పరిధిలో గల 24 బీ సర్వే నంబర్‌లో స్థలంలో ట్రావెర్స్ సర్వే చేయనున్నారు.

దొంగ ఓట్లతో గెలవడం రాజ్యాంగ విరుద్ధం