పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

Aug 12 2025 7:37 AM | Updated on Aug 12 2025 12:48 PM

పోలీస

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

అమలాపురం టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పోలీస్‌ గ్రీవెన్స్‌) స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ వారితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీస్‌ గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీల్లో సగం వరకూ ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీదారులతో ఎస్పీ చర్చించి, వాటి పరిష్కార చర్యలపై ఆయా పోలీస్‌ స్టేషన్ల అధికారులకు నిర్దేశించారు.

రూ.1.50 లక్షలవెండి కిరీటం సమర్పణ

అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారంలో ఉన్న పార్వతీ వీరేశ్వర స్వామివారికి దాతలు వెండి కిరీటం, ఆభరణాలను సోమవారం సమర్పించారు. గంగలకుర్రుకు చెందిన తనికెళ్ల సోమసూర్య సుబ్రహ్మణ్య విశ్వేశ్వరరావు కుమారులు వెంకటసత్య సూర్యనాగభూషణం, లక్ష్మీసూర్యపద్మ దంపతులు, తనికెళ్ల రామలక్ష్మి నరసింహమూర్తి, పద్మావతి దంపతులు, మనవలు దుర్గావిశ్వనాథం, మనవరాలు ఉమాభాను రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటం, ఆభరణాలను పార్వతీ వీరేశ్వరస్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వెండి వస్తువులను ఆలయ ప్రధానార్చకులు చంద్రమౌ ళీ సూర్యకామేష్‌ ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించి, స్వామివార్లకు అలంకరించారు.

వాడపల్లి ఆలయానికి బ్యాటరీ కార్లు

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రెండు బ్యాటరీ కార్లు అందజేసింది. కోనసీమ తిరుమలగా ప్రసి ద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మెర్లపాలెం గ్రామానికి చెందిన జేఎస్‌ఎన్‌ రాజు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ వారు రూ.12 లక్షలు విలువైన రెండు కార్లను అందజేసినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డీసీ, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ కార్లను ఈ నెల 15న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభిస్తారని చెప్పారు.

పాతికేళ్ల తర్వాత తల్లి చెంతకు..

కె.గంగవరం: కన్న కొడుకును చూడాలనే తల్లి కోరిక కె.గంగవరం పోలీసుల చొరవతో ఫలించింది. పాతికేళ్ల తర్వాత కన్న కొడుకు చూసిన ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఒకరినొకరు హత్తుకుని విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే, పామర్రు గ్రామానికి చెందిన 80 ఏళ్ల శీలం పద్మినికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ఓ కుమార్తె వాసంశెట్టి సుబ్బలక్ష్మి గుంటూరులో, పితాని వసంత వేమగిరిలో ఉంటున్నారు. కుమారుడు శ్రీరాములు కుటుంబ కలహాలతో పాతికేళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి పొట్టకూటి కోసం కువైట్‌లో ఉంటున్నాడు. పద్మిని రెండో కుమార్తె వద్ద ఉంటోంది. ఇటీవల పద్మిని వృద్ధాప్యంతో ఉన్న తనకు చివరి కోరికగా కుమారుడిని చూడాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. కలెక్టర్‌ ఆదేశాలతో డీఎస్పీ రఘవీర్‌, సీఐ వెంకటరమణ సూచనలతో ఎస్సై జాని బాషా ఆమె కుమారుడి అన్వేషణ చేపట్టారు. హెచ్‌సీ పెద్దినారాయణరావుతో శ్రీరాములు చిరునామా సేకరించారు. విశాఖపట్నంలో స్థిరపడి, కువైట్‌లో పనిచేస్తున్న శ్రీరాములును గుర్తించారు. వారి చొరవతో శ్రీరాములు సోమవా రం తల్లి వద్దకు చేరాడు. పేగు బంధాన్ని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. పోలీసులకు పద్మిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు 1
1/3

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు 2
2/3

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు 3
3/3

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement