
శరణు గణేశా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 20 జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురికి తులాభారం, తొమ్మిది మంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 49 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 2,200 మంది స్వీకరించారు. ఈ ఒక్క రోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.2,25,767 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్‌చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.