
దుప్పట్లు ఉతికేందుకు టెండర్
● విడుదల చేసిన అన్నవరం దేవస్థానం
● ‘సాక్షి’ కథనానికి స్పందన
● ప్రస్తుతం నామినేషన్ విధానంలో నెలకు రూ.60 వేల చెల్లింపు
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని సత్రాల గదులలో ఉపయోగించే దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లు, రగ్గులను ఉతికేందుకుగాను దేవస్థానం అధికారులు సోమవారం టెండర్ పిలిచారు. గత మార్చి నుంచి ఇవి ఉతికేందుకు గాను నామినేషన్ మీద నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఈ నామినేషన్ మీద కేటాయించారన్న విమర్శ కూడా ఉంది. టెండర్లు పిలిస్తే ఇంకా తక్కువకు వీటిని ఉతుకుతారనే అభిప్రాయం నెలకొంది. గత నెల 23న స్థానిక రజకవృత్తిదారుడు కింతాడ శ్రీనివాసరావు తాము నెలకు రూ.45 వేలకే వాటిని ఉతుకుతామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘సత్యదేవునికే టెండర్’ శీర్షికన వార్త ప్రచురితమైంది.
21 వరకూ దరఖాస్తులకు గడువు
దేవస్థానంలో రెండేళ్లపాటు పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహించిన కేఎల్‌టీఎస్ సంస్థ గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ సత్రం గదులలో మంచాలపై వేసిన దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లను ఉతికించే పని కూడా నిర్వహించేది. అప్పుడు వాషింగ్ మెషీన్ల ద్వారా శుభ్రం చేసేవారు. ఆ సంస్థ కాంట్రాక్టు పూర్తి కావడంతో గత మార్చి నుంచి నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తూ శుభ్రం చేయిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. పైగా వాటిని ఉతికేందుకు మెటీరియల్‌ను దేవస్థానమే అందజేస్తోంది. ప్రస్తుతం మనుషులు ఉతుకుతుండడంతో అంతగా శుభ్రంగా ఉండడం లేదని, వాసన వస్తున్నాయన్న ఫిర్యాదులు భక్తుల నుంచి వస్తున్నాయి. దీంతో వాషింగ్ మెషీన్లు టెండరు దారుడే సమకూర్చుకుని ఉతికి ఇచ్చేందుకు టెండర్ పిలిచారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

దుప్పట్లు ఉతికేందుకు టెండర్